దిగుబడిపై.. దిగులు!
♦ ఖరీఫ్ దిగుబడులపై రైతుల్లో ఆందోళన
♦ సకాలంలో కురవని వర్షాల ఫలితం
♦ మొక్కజొన్న, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం
♦ మరిన్ని వానలు కురిస్తేనే గట్టెక్కనున్న కంది..
♦ ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ
ఖరీఫ్‌లో సాధారణ, సాగైన విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో)...
పంట సాధారణం సాగు
వరి 25,600 20,338
జొన్న 9,171 6,418
మొక్కజొన్న 42,857 48,723
కంది 35,247 42,282
పెసలు 5,651 6,387
మినుములు 4,465 5,532
ఆముదం 2,118 1,188
సోయా 17,200 5,259
పత్తి 57,247 40,069
ఖరీఫ్ చివరి దశకు చేరింది. ఈ నెలాఖరుతో సీజన్ ముగియనుంది. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ ఈసారి విస్తీర్ణం ఆశాజనకంగానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,17,295 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 1,85,713 హెక్టార్లే సాగైంది. సీజన్ ముగియడానికి మరో పక్షం రోజులు గడువున్నప్పటికీ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ఈసారి సాధారణ విస్తీర్ణంలో 85శాతం సాగు జరిగినప్పటికీ... వర్షాల మధ్య అంతరం భారీగా ఉండడం, కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దిగుబడిపై రైతాంగం ఆందోళన చెందుతోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రెండేళ్లుగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈసారీ పునరావృతమయ్యాయి. సీజన్‌లో క్రమంగా కురవాల్సిన వర్షాలు అడపాదడపా భారీగా కురిశాయి. దీంతో రైతులు మెట్టపంటలు సాగుచేశారు. అయితే, సాగుచేసిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో పలుచోట్ల పంటలు నేలవాలాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో అవి తిరిగి జీవం పోసుకున్నప్పటికీ దిగుబడి చేతికి వచ్చే అంశంపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు భారీ విస్తీర్ణంలో సాగయ్యాయి.
సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగైనప్పటికీ... వాటిలో ప్రస్తుతం పూర్తిస్తాయి దిగుబడి ఇచ్చే పంటలు తక్కువని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జూ నెలలో వర్షాలు మురిపించినా జూలైలో మాత్రం కాస్త మందగించాయి. ఆ తర్వాత ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలే నమోదయ్యాయి. సీజన్‌లో 58.7 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా... ఇప్పటివరకు 45.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ వర్షాలతో అక్కడక్కడా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పంటల ఎదుగుదలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు.
వర్షాల మధ్య అంతరం 3 రోజులకుగాను కొన్ని చోట్ల 7 నుంచి 10 రోజుల వరకు ఉంది. ఈ సమయంలో పంటల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాధం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పంటల దిగుబడి భారీగా పతనం కానుంది. వివిధ మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు విశ్లేషిస్తున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలపై ఈ ప్రబావం పడనుంది. కంది పంటకు మరింత సమయం ఉన్నందున... ఆ లోపు మరిన్ని వర్షాలు కురిస్తే సత్ఫలితాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది.