మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ వీరరెడ్డి
సంగారెడ్డి టౌన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.7,800 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023–24 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్ వీరారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్లు కేటాయించామన్నారు. ఈ ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రైతులకు పంట రుణాలు ఇవ్వనున్నామన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, టర్మ్ రుణాలకు రూ. 4,147 కోట్లు, సూక్ష్మ సంస్థలకు రూ. 516.60 కోట్లు, చిన్న సంస్థలకు రూ.167.40 కోట్లు, మధ్యతరహా సంస్థలకు రూ. 326 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించామన్నారు. ఎంఎస్‌ఎంఈ కింద మొత్తం రూ.1,010 కోట్ల రుణాలివ్వడం లక్ష్యమని చెప్పారు. విద్యా రుణాలు కింద రూ.85 కోట్లు, గృహ రుణాలు రూ. 1,270 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 46 కోట్లు, పునరుత్పాదక శక్తి కింద రూ.7 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,235 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు.
ఆయా రంగాలకు బ్యాంకర్లు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. అంతకుముందు 2022–23(మార్చి 31 నాటికి) వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను ఎల్‌డీఎం గోపాల్ రెడ్డి వివరించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి రూ.7080.80 కోట్ల లక్ష్యం కాగా 10,269.42 కోట్ల రుణాలు అందించి 145 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారికి, బ్యాంకర్లకు కోఆర్డినేషన్ అవసరమని అన్నారు. ఏఈఓ వారీగా గ్రామం, బ్యాంకు బ్రాంచ్, పంట రుణాల టార్గెట్, సాధించిన లక్ష్యాల వివరాలు అందించా లని సూచించారు.
అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కష్ణ తేజ, ఆర్బీఐ ఏజీఎం అలీ బాబా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, మెప్మా పీడీ, జిల్లా వ్యవసాయ అధికారి, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్స్ పాల్గొన్నారు.
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలి
సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వ్యవసాయ, పంచాయితీ, అటవీ, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలు ఏఈవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment