వేరు తొలిచే పురుగు
జహీరాబాద్: చెరకుతో పాటు ఇతర పంటలను వేరుతొలుచు పురుగు ఆశించి అపారనష్టం కలిగిస్తోంది. ఏటా వర్షాకాలంలో దీని ఉధృతి అధికంగా ఉంటోంది. చెరకు, పత్తి, కంది, మొక్కజొన్న, మిరప, అల్లం వంటి పంటలను సైతం దెబ్బతీస్తోంది. పంట వేసినప్పుడు ఈ పురుగు ఆశించి, పంటలేనప్పుడు భూమిలో దాగి ఉంటుందని డీడీఎస్–కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఎన్.స్నేహలత పేర్కొన్నారు. ఎప్పుడయితే మొదటి వర్షం పడుతుందో అప్పుడు భూమిలో ఉన్న పురుగులు వేప, రేగు, మునగ పంటలపై ఆశించి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయన్నారు. భూమిలో ఉన్న తల్లి పురుగులు 50–60 సెంటీ మీటర్ల లోతున 30–35 గుడ్లు పెడుతుందని, ఇలా పొదిగిన లద్దె దశలు కొత్తగా వేసిన పంటల వేరు వ్యవస్థను ఆశిస్తాయన్నారు. ఈ పురుగు యాసంగిలో కోశస్థ దశకు మారి భూమిలోనే ఉండిపోయి మళ్లీ వర్షాలు పడినప్పుడు బయటకు వస్తాయని, ఇలా వాటి జీవితచక్రాన్ని పూర్తి చేస్తాయన్నారు.
నష్టపరిచే విధానం
వేరుపురుగు ఆశించిన పంటను గమనిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి పంట వడలిపోతుంది. ఇలా వడలిన మొక్కలను పీకినప్పుడు చాలా సులభంగా బయటకు వస్తాయి. పప్పు దినుసుల్లో వేరు వ్యవస్థ నత్రజనిని ఆశించే బుడిపెలు కలిగి ఉంటాయి. వాటిని ఈ పురుగు ఆశించి నత్రజని సౌకర్యాన్ని అందకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా చెరకులో రటూన్(మొడెం) పంటను ఆశిస్తుంది.
యాజమాన్య పద్ధతులు
● పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకోవాలిత
● రైతులు పెంట ఎరువులు వేస్తారు. మగ్గిన పెంటఎరువులో ఈ పురుగు ఎక్కువగా గుడ్లు పెడుతుంది. వీటి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చిలికిన పెంటను ఎరువుగా వేసుకోవాలి.
● మొక్కలు ఎండిపోయి, వడలిపోయినట్టు కనిపిస్తే మెటారైజియం అనే సూక్ష్మం 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడపాలి లేదా డ్రిప్ నీటివసతి కలిగి ఉంటే అందులో వదలాలి.
● వేసవి జల్లులు ముగిసిన వెంటనే పంట చుట్టూ ఉన్న వేప, అకేశియా చెట్లు ఉన్న చోట లైట్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల తల్లి పురుగు ఆకర్షితమై అందులో పడిపోతాయి. ఇలా పడిన వాటిని చంపివేయాలి.
● దశవర్ణి కషాయం 6 లీటర్లు ఒక ఎకరానికి కలిపి మొదళ్లను తడపాలి.
Comments
Please login to add a commentAdd a comment