root worms
-
వేధించే వేరుతొలుచు పురుగు
జహీరాబాద్: చెరకుతో పాటు ఇతర పంటలను వేరుతొలుచు పురుగు ఆశించి అపారనష్టం కలిగిస్తోంది. ఏటా వర్షాకాలంలో దీని ఉధృతి అధికంగా ఉంటోంది. చెరకు, పత్తి, కంది, మొక్కజొన్న, మిరప, అల్లం వంటి పంటలను సైతం దెబ్బతీస్తోంది. పంట వేసినప్పుడు ఈ పురుగు ఆశించి, పంటలేనప్పుడు భూమిలో దాగి ఉంటుందని డీడీఎస్–కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త ఎన్.స్నేహలత పేర్కొన్నారు. ఎప్పుడయితే మొదటి వర్షం పడుతుందో అప్పుడు భూమిలో ఉన్న పురుగులు వేప, రేగు, మునగ పంటలపై ఆశించి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయన్నారు. భూమిలో ఉన్న తల్లి పురుగులు 50–60 సెంటీ మీటర్ల లోతున 30–35 గుడ్లు పెడుతుందని, ఇలా పొదిగిన లద్దె దశలు కొత్తగా వేసిన పంటల వేరు వ్యవస్థను ఆశిస్తాయన్నారు. ఈ పురుగు యాసంగిలో కోశస్థ దశకు మారి భూమిలోనే ఉండిపోయి మళ్లీ వర్షాలు పడినప్పుడు బయటకు వస్తాయని, ఇలా వాటి జీవితచక్రాన్ని పూర్తి చేస్తాయన్నారు. నష్టపరిచే విధానం వేరుపురుగు ఆశించిన పంటను గమనిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి పంట వడలిపోతుంది. ఇలా వడలిన మొక్కలను పీకినప్పుడు చాలా సులభంగా బయటకు వస్తాయి. పప్పు దినుసుల్లో వేరు వ్యవస్థ నత్రజనిని ఆశించే బుడిపెలు కలిగి ఉంటాయి. వాటిని ఈ పురుగు ఆశించి నత్రజని సౌకర్యాన్ని అందకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా చెరకులో రటూన్(మొడెం) పంటను ఆశిస్తుంది. యాజమాన్య పద్ధతులు ● పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకోవాలిత ● రైతులు పెంట ఎరువులు వేస్తారు. మగ్గిన పెంటఎరువులో ఈ పురుగు ఎక్కువగా గుడ్లు పెడుతుంది. వీటి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చిలికిన పెంటను ఎరువుగా వేసుకోవాలి. ● మొక్కలు ఎండిపోయి, వడలిపోయినట్టు కనిపిస్తే మెటారైజియం అనే సూక్ష్మం 5 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లు తడపాలి లేదా డ్రిప్ నీటివసతి కలిగి ఉంటే అందులో వదలాలి. ● వేసవి జల్లులు ముగిసిన వెంటనే పంట చుట్టూ ఉన్న వేప, అకేశియా చెట్లు ఉన్న చోట లైట్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల తల్లి పురుగు ఆకర్షితమై అందులో పడిపోతాయి. ఇలా పడిన వాటిని చంపివేయాలి. ● దశవర్ణి కషాయం 6 లీటర్లు ఒక ఎకరానికి కలిపి మొదళ్లను తడపాలి. -
వేరుశనగలో సస్యరక్షణ
ఆకు ముడత తామర పురుగులు, పచ్చ దోమలు ఆకుల కింది భాగన రసం పీల్చడం వల్ల ఆకులు ముడ్చుకుని మొక్కలు గిడస బారిపోతాయి. ఆకుల అడుగు భాగన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తామర పురుగు నివారణకు క్లోరో ఫిరిపాస్ 400 మిల్లీలీటర్లు ఒక లీటర్ వేపనూనెతో కలిసి 200 లీటర్లతో ఎకరానికి పిచికారి చేయాలి. పచ్చదోమ నివారణ కోసం డైమిదేమెట్ 400 మిల్లీలీటర్లు లేదా 300గ్రాముల ఎసిఫేట్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎర్ర గొంగళి పురుగు లార్వ దశలో ఉండే పురుగులు ఆకుల్లో పత్రహరితాన్ని తింటాయి. ఎదిగిన పురుగులు ఆకులను తినేసి కొమ్మలను, మొదళ్లను మాత్రమే మిగుల్చుతాయి. వీటి నివారణకు ప్రధానంగా ఆముదం పంటను ఎరగా వేసి నివారించవచ్చు. లేదా డైమిదేమెట్ 400 మిల్లీ లీటర్లు లేదా 300గ్రాములు మోనోక్రోటోపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వేరు పురుగులు ఇసుక నేల ల్లో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగులు నేలపై నివసిస్తూ వేర్లను కొరికి వేయడం వల్ల మొక్కలు నిలువుగానే వాడి, ఎండిపోతాయి. వీటి నివారణకు 3జీ గుళికలను ఎకరానికి 10 కేజీలు చల్లాలి. తిక్క మచ్చ తెగుళ్లు తిక్కమచ్చ తెగుళ్లు వేరుశనగ పంటను 30 రోజుల నుంచి ఆశిస్తున్నాయి.ఆకుపై గుండ్రటి మచ్చలు ఏర్పడి గోధుమ రంగులోకి ఆకు మారుతుంది. దీని నివారణకు ఎకరానికి మ్యాంకోజెబ్ 400గ్రాములు, క్లోరోథలిన్ 400గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుకుళ్లు తెగుళ్లు పల్లిలో వేరుకుళ్లు తెగుళ్లు 30రోజుల నుంచి ఆశిస్తుంది. వేరుకుళ్లు తెగుళ్లకు వర్షభావ పరిస్థితులు అనుకూలం. మొదట కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. త ర్వాత నలుపు రంగులోకి మారి వేరు కుళ్లిపోతుంది. నివారణకు ట్రైకోడర్మా పౌడర్‌ను చల్లాలి. లేదా మ్యాంకోజబ్ను 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి మొదళ్ల పై చల్లాలి. సకాలంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు.