శ్రీకాకుళం అగ్రికల్చర్, పాత బస్టాండ్: రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు గానీ.. రుణాలు మాఫీ కావాలన్నా, రీషెడ్యూల్ చేయాలన్నా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందేనని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డులు లేని వారు వాటి కోసం కేంద్రాలకు పరుగులు తీస్తుంటే.. కార్డులు ఉన్న వారు వాటిని అనుసంధానం చేయించుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.
లక్ష మందికి పైగా అవస్థలు
జిల్లా జనాభా సుమారు 27 లక్షలు. వీరిలో సుమారు లక్ష మంది ఇంకా ఆధార్ ఫొటోలు దిగాల్సి ఉంది. జనవరి నుంచి ఆధార్ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆధార్ కేంద్రాలు తెరుస్తామని అధికారులు చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మీ సేవ కేంద్రాలకు ఆ బాధ్యతలు అప్పగించినా పలు కారణాల వల్ల అక్కడ ఆ ప్రక్రియ సజావుగా సాగడంలేదు.
ఫొటోలు తీయించుకోనివారి కష్టాలు ఇలా ఉంటే.. గతంలోనే ఆధార్ చేయించుకున్న వారి కష్టాలు మరోలా ఉన్నాయి. వీరిలో చాలా మందికి ఇంతవరకు కార్డులు అందలేదు. కార్డు ల కోసం మీ-సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సలహా ఇస్తున్నారు. అయితే అక్కడ కూడా ఆధార్ కార్డులు, లేదా దానికి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని ప్రజలు చెబుతున్నారు.
రైతులను చులకనగా చూస్తున్న బ్యాంకర్లు
ఇదిలా ఉండగా సహకార, గ్రామీణ బ్యాంకులు మినహా వాణిజ్య బ్యాంకుల వద్దకు ఆధార్ కార్డులతో రైతులను వారు చులకనగా చూస్తున్నారు. ఖరీఫ్ సీజనులో వ్యవసాయ పనులు మానుకొని ఆధార్ కార్డులు పట్టుకొని వెళితే నెంబర్లు నమోదు చేసుకోవడానికి రేపు, మాపు అంటూ వాణిజ్య బ్యాంకుల సిబ్బంది తిప్పుతుండటంతోపాటు అడిగిన వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇదంతా పాలకుల నిర్వాకం ఫలితమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు తాళం
మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకూ ఆధార్ గొళ్లెం పెట్టేశారు. గత నాలుగు నెలలుగా ఇళ్ల నిర్మాణాల బిల్లులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు వీటి కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆధార్‌ను తెరపైకి తెచ్చింది. 2003 నుంచి లబ్ధిదారులందరికీ ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించడంతో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు జాబితాలు పట్టుకొని లబ్ధిదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.
దీనివల్ల ఒకే లబ్ధిదారుడు రెండుసార్లు ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట వేయవచ్చని, తద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చన్న ప్రభుత్వ ఉద్దేశం. ఈ నెలాఖరునాటికి ఈ పని పూర్తి చేయాలని ఆదేశించడంతో వర్క్ ఇన్‌స్పెక్టర్లు మొదలుకొని ఏఈలు, డీఈ సైతం ఇందులోనే నిమగ్నమయ్యారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆధార్ అనుసంధానం సాధ్యమయ్యే పని కాదని ఉద్యోగులు వాపోతున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త ఇళ్లు మంజూరయ్యే పరిస్థితి కన్పించడం లేదు, ఈ ఏడాది నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున జిల్లాలో 20 వేల ఇళ్లు నిర్మిం చాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు లబ్ధిదారుల ఎం పికే పూర్తి కాలేదు. గత ఏడాది 23 వేల ఇళ్ల నిర్మాణా లు లక్ష్యం కాగా 17 వేలు మాత్రమే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి రూ.14 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉంది. ఆ ఇల్లులో కొన్నింటికి నిర్మాణాలు పూర్తయ్యి బిల్లులు బకాయిలు 14 కోట్లు ఉన్నాయి.
అప్పటి లబ్ధిదారులు ఎక్కడో?
కాగా ఆధార్ అనుసంధానానికి 2003 సంవత్సరాన్ని ప్రతిపదికగా తీసుకోగా అప్పటి నుంచి 2007 వరకు సుమారు 42వేల ఇళ్లు నిర్మించారు. 2007 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ, తదితర పలు పథకాల కింద 3 లక్షల వరకు ఇళ్లు మంజూరయ్యాయి. వీటన్నింటికి ఆధార్ సిడింగ్ చేయాలి. దాంతో అప్పటి జాబితాలు పట్టుకొని సిబ్బంది కుస్తీ పడుతున్నారు. లబ్ధిదారుల్లో కొందరు మరణించగా, మరెంతో మంది స్థానికంగా లేరు. చాలా ఇళ్లు చేతులు మారిపోయాయి. దీంతో లబ్ధిదారులతోపాటు గృహనిర్మాణ సంస్థ సిబ్బంది ఆధార్ గుదిబండగా మారింది.
ఆధార్..బేజార్!
Published Sat, Aug 9 2014 4:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement