గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’ కష్టం! | Requests to pay compensation through banks | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’ కష్టం!

Published Sun, Aug 13 2017 1:23 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’ కష్టం!

గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’ కష్టం!

రుణ బకాయిలు వసూలు కావడం లేదంటూ బ్యాంకర్ల గగ్గోలు
- భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న రైతులు
ప్రాజెక్టులకని ఆ భూములను సేకరిస్తున్న సర్కారు.. పరిహారం నేరుగా అందజేత
దీంతో రైతులు రుణ బకాయిలు కట్టడం లేదంటున్న బ్యాంకర్లు
బ్యాంకుల ద్వారా పరిహారం సొమ్ము అందించాలంటూ విజ్ఞప్తులు
దీనిని తిరస్కరించిన కలెక్టర్లు ∙స్వశక్తి సంఘాల బకాయిలతోనూ సమస్య!  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులకు ‘ముంపు’సమస్య వచ్చిపడింది. వివిధ ప్రాజెక్టుల కోసం చేస్తున్న భూసేకరణ కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. రైతులు భూములను తమ వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారని.. ఆ భూములను సేకరిస్తున్న ప్రభుత్వం పరిహారాన్ని నేరుగా వారికే అందజేస్తుండటంతో బకాయిలు వసూలుకావడం లేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. భూమే లేనప్పుడు రుణాలు చెల్లించాల్సిన అవసరమేముందని రైతులు ఆలోచిస్తున్నారని.. దాంతో రూ.వందల కోట్లలో బకాయిలు వసూలుకాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నాయి. పరిహారం సొమ్మును బ్యాంకుల ద్వారా అందజేయాలని, దానివల్ల బకాయిలు వసూలవుతాయని విజ్ఞప్తి చేస్తున్నాయి. లేకపోతే చట్టపరంగా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ పేర్కొనడం గమనార్హం.
 
ప్రాజెక్టుల కోసం భారీగా భూసేకరణ
రాష్ట్రంలో పలు సాగునీటి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాల వరకు భూమిని సేకరిస్తోంది. అందులో అత్యధికంగా వ్యవసాయ భూములే ఉన్నాయి. మరోవైపు చాలా మంది రైతులు తమ భూములను వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌ తదితర జిల్లాల్లో ఈ రుణాల మొత్తం కోట్లలో ఉంది. ఒక్క మెదక్‌ జిల్లాలోనే రైతుల రుణాల మొత్తం రూ.50 కోట్ల వరకు ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ ప్రాజెక్టుల కోసం భూములను తీసుకుంటున్న ప్రభుత్వం నేరుగా రైతులకు పరిహారం చెల్లిస్తోంది.

పరిహారం సొమ్ము అందుతుండటంతో బ్యాంకుల్లో ఉన్న రుణ బకాయిల గురించి రైతులు పట్టించుకోవడం లేదని బ్యాంకుల అధికారులు పేర్కొంటున్నారు. భూమే లేనప్పుడు రుణ బకాయిలు చెల్లించడం ఎందుకులేనన్న ఆలోచనలో రైతులు ఉంటున్నారని.. దాంతో బ్యాంకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పలుచోట్ల అయితే ముంపు ప్రాంతాల నుంచి ఖాళీ చేస్తున్న రుణ గ్రహీతలు.. ఎక్కడ ఉంటున్నారనే ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
 
స్వయం సహాయక సంఘాల నుంచీ..
ప్రాజెక్టుల కారణంగా ముంపు ఎదుర్కొంటున్న గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల  నుంచి కూడా గ్రామీణ బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అవీ బ్యాంకులకు రూ. కోట్లలో బకాయి ఉన్నాయి. ముంపు గ్రామాలను ఖాళీ చేయించినప్పుడు.. ఎవరికి తోచిన చోటుకు వారు వెళుతుంటారు. దాంతో బకాయిదారుల చిరునామాలు తెలుసుకోవడం కష్టమవుతోందని బ్యాంకులు అంటున్నాయి. 
 
కలెక్టర్ల దృష్టికి సమస్య
ఈ అంశంపై ఆయా బ్యాంకులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వంగా ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చాయి. భూసేకరణ నిమిత్తం ఇస్తున్న పరిహారాన్ని బ్యాంకుల ద్వారా చెల్లించాలని కోరాయి. తద్వారా తమ బకాయిలు వసూలవుతాయని వివరించాయి. అయితే దీనిపై కలెక్టర్ల నుంచి సానుకూలత రాలేదని బ్యాంకులు చెబుతున్నాయి. ఆయా భూముల్లో ఉన్న నిర్మాణాలకు పరిహారం ఇవ్వాల్సి ఉందని... అది చెల్లించేటప్పుడు బ్యాంకుల ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామన్నారని బ్యాంకులు వాపోతున్నాయి. 2013 భూసేకరణ చట్టం  ప్రకారం.. పరిహారం చెల్లింపుపై వివాదం తలెత్తినప్పుడు దానిని సంబంధిత అధికారికి నివేదించాలని, దాంతో పరిహారాన్ని ఆ అధికారి వద్ద డిపాజిట్‌ చేసి... విచారణ పూర్తయ్యాక పరిహారం చెల్లిస్తారని చెబుతున్నాయి.

అలా చేస్తే తమ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందని.. కానీ ప్రభుత్వం స్పందించడం లేదంటున్నాయి. ‘‘ప్రభుత్వమే ప్రత్యేక సమావేశాలు పెట్టి రైతులకు రుణాలివ్వాలని చెబుతుంది. మాకు అభ్యంతరం లేదు. రైతులపై మాకు కక్ష లేదు. పరిహారం ఇవ్వొద్దని చెప్పడం లేదు. బకాయిల గురించి ఆలోచించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇబ్బం దులపై ప్రభుత్వానికి నివేదిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఇలా రూ.వందల కోట్ల  రుణాలు వసూలు కాకుంటే బ్యాంకులు మూసివేసే పరిస్థితి వస్తుంది. మళ్లీ రుణాలు అందక ఇబ్బంది పడేది రైతులే..’’అని ఓ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ వ్యాఖ్యానించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement