commercial banks
-
బంగారు రుణాలపై గురి
సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి. కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్‌ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి. నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రత్యేక దృష్టి పెట్టాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్పర్సన్, ఆప్కాబ్ -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్‌బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. మార్పులేదు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. గాడిన పడుతోంది వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రిపోరేటు ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రిపో రేటు అంటారు. -
ఆర్థిక సాధికారత
సాక్షి, హైదరాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం ప్రగతి సాధ్యపడుతుంది. మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలును గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేపడుతోంది. స్థానికంగానే ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా కసరత్తు సాగిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలకు ఉపాధి కలి్పంచేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మహిళా గ్రూపుల్లోని వారి సామర్థ్యం, ఆసక్తి మేరకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పీఆర్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా గ్రూపుల ద్వారా వారు నిర్వహించే వ్యాపారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈసారి భారీగా రుణ సాయం అందించనుంది. గ్రామాల్లో సర్వే... మహిళా సంఘాలకు రుణ సాయం, వాటితో వ్యాపారం చేసే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్‌లో ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధం చేసి, వచ్చే నెల నుంచి రుణంæ మంజూరు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మహిళా సంఘాల రుణాల మంజూరు అంశాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మహిళా గ్రూపులకు గుర్తింపు.. బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభదాయక వ్యాపారం చేయడంలో రాష్ట్ర మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డీసీసీబీల పరిధిలో మొత్తం రూ.6,583 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు ఈ రుణాలిస్తారు. రుణాలతో వ్యవసాయ పనులు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు ఏఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో పలు వివరాలు వెల్లడయ్యాయి. 2017–18 సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది వ్యవసాయ పనుల కోసం రూ.1,561.86 కోట్లు వినియోగించారు. విడుదల చేసిన మొత్తం రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులకు ఖర్చు చేశారు. 2018–19 సంవత్సరంలో మొత్తం రూ.807.49 కోట్లు వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో ఇది 28.7 శాతం. -
కమర్షియల్ కు దీటుగా కో-ఆపరేటివ్ సేవలు
ఖాతాదారులకు ఏటీఎంల పంపిణీ దోమకొండ: కమర్షియల్ బ్యాంకులకు దీటు గా కో ఆపరేటివ్ బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయని డీసీసీబీ ఉపాధ్యక్షుడు పరికి ప్రేంకుమార్ అన్నారు. మండల కేం ద్రంలోని కో ఆపరేటీవ్ బ్యాంకులో శుక్రవా రం ఖాతాదారులకు ఏటీఎం కార్డులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి జిల్లాలోని కో ఆపరేటీవ్ ఖాతాదారులందరికీ ఏటీఎంలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతులకు రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో దోమకొండ సిం గిల్‌విండో చైర్మన్ నర్సారెడ్డి, ముత్యంపేట సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, కో ఆపరేటీవ్ బ్యాంకు మేనేజర్ శాంతాదేవి, సొసైటీ సీఈవోలు బాల్‌రెడ్డి, రాంచంద్రం, నర్సాగౌడ్, బ్యాంకు సిబ్బంది శ్రీపాల్‌రెడ్డి, సాయికృష్ణ, సునీత, రాకేశ్, శ్రావణ్‌రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ రుణమే దిక్కు
అన్నదాతకు అందని రుణాలు వడ్డీ కట్టించుకుని పునరుద్ధరణతోనే సరి వాణిజ్య బ్యాంకుల్లో కొనసాగుతున్న తంతు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడంతోనే ఇబ్బంది హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతోంది. మరో పక్క రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులన్నీ వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేసి పంపించేస్తున్నాయి. కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడమే. అంటే.. పంటల వారీ ఏటా పెంచే రుణపరిమితిని ఈ ఏడాది పెంచలేదు.ఇలా రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతలను వడ్డీ వ్యాపారుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ఇచ్చిన నిధులు ఆయా రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మాఫీ పేరుతో ఇచ్చిన 20 శాతం నిధులు ఆయా రైతుల అప్పులపై ఉన్న వడ్డీకిసరిపోలేదు. దీంతో ఆయా రైతుల రుణాలు గత ఖరీఫ్ సీజన్లో రెన్యువల్ కాలేదు. ఈ ఖరీఫ్‌లోనైనా వడ్డీలు చెల్లించి రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే 18 శాతం వరకు వడ్డీ భారం పడుతోందంటూ బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. రైతులు వడ్డీలు చెల్లించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సహకార బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి సన్న, చిన్న కారు రైతులకు ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచీ రుణం మంజూరు కావడం లేదు. నాబార్డు ఆప్కాబ్‌కు రుణం మంజూరు చేస్తేనే ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఆ నిధులను ఇస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు ఆ నిధులను ప్రాథమిక సహకార బ్యాంకులకు అందజేస్తాయి. వాటిని ప్రాథమిక సహకార బ్యాంకులు రైతులకు రుణంగా ఇస్తాయి. నాబార్డు రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి దీనికి 0.05 శాతం ఆప్కాబ్ కమిషన్‌గా ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ఆర్థిక స్తోమత లేదని, కమిషన్ లేకుండా గ్యారెంటీ ఇవ్వాల్సిందిగా ఆప్కాబ్ కోరినప్పటికీ ఆర్థిక శాఖ కరుణించడం లేదు. . -
మాఫీ మాయే!
బకాయిల వసూలుకు బ్యాంకర్ల సన్నాహాలు బంగారు రుణాలపై వేలం నోటీసుల జారీ పంట రుణాల వసూలుకు సొసైటీ బృందాలు లబోదిబోమంటున్న అన్నదాతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. బకాయిల వసూలుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తుండటమే దీనికి నిదర్శనం. రైతు సాధికార సంస్థ ద్వారా ఐదేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, ఐదేళ్ల పాటు వడ్డీ, అసలు బకాయిలు పేరుకుపోయి నష్టపోతారంటూ బ్యాంకర్లు వసూళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.9,137 కోట్లు ఉండగా, రెండు వేల కోట్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే విధంగా కుదించినట్లు సమాచారం. మిగిలినవారికి రుణమాఫీ వర్తించదని అధికారులు రికార్డులు తయారు చేసినట్లు తెలిసింది. బంగారం రుణాలపై వేలం నోటీసులు... సహకార బ్యాంకు సిబ్బంది పంట రుణాలను జబర్దస్తీగా వసూలు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేసుకుంటుండగా, వాణిజ్య బ్యాంకులు బంగారం రుణాలకు సంబంధించి వేలం నోటీసులు జారీ చేస్తున్నాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు డివిజన్లలో సహకార అధికారులు 425 సహకార సంఘాల వేతన కార్యదర్శులు, సిబ్బందితో రుణ వసూళ్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రుణ మాఫీ ఆలస్యం అవుతున్నందున బకాయిల వసూలుకు వెంటనే రైతుల వద్దకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో రుణాలు కట్టమంటే రైతులు తిరగబడి కొడతారని పలువురు సహకార సంస్థలలో పని చేసే కార్యదర్శులు అధికారుల వద్ద మొర పెట్టుకోగా.. అయినా తప్పదని, రుణమాఫీ వల్ల రెండు రకాలుగా నష్టపోతారని రెతులకు వివరించాలని సహకార ఉన్నతాధికారులు కార్యదర్శులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐదేళ్లలోపు దశలవారీగా రుణమాఫీ చేస్తే మొత్తం బాకీ తీరేవరకు బ్యాంకుల్లో ఉన్న బంగారం విడుదల కాదని వివరించాలని చెప్పినట్లు తెలిసింది. పంట రుణాలకు సంబంధించి సహకార సంస్థల్లో 11 శాతం వడ్డీ పడుతుందని రైతులకు వివరించాలని, ఏదో విధంగా వారికి నచ్చచెప్పి ముందుగా బాకీలు వసూలు చేయాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తూ ఇచ్చే డబ్బు బ్యాంకులకు వచ్చింది వచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో పడుతుందని చెప్పి.. బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్య, సహకార బ్యాంకులు మందస్తు ప్రణాళిక సిద్ధం చేశాయి. బంగారం వేలానికి ఆర్బీఐ సూచన! 15 నెలలు దాటిన బంగారు రుణాలకు సంబంధించి నగలను వెంటనే వేలం వేసి బకాయికి జమ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు బంగారం ధర రోజురోజుకు తగ్గటం బ్యాంకర్లను కలవరానికి గురిచేస్తోంది. తాము రుణం ఇచ్చేటప్పుడు గ్రాము రూ.4 వేలు వరకు ఉందని, అది ప్రస్తుతం రూ.2,600కు పడిపోయిందని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. బంగారం ధర మరింత తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనతో బ్యాంకర్లు జిల్లా వ్యాప్తంగా బంగారు రుణాలు తీసుకున్న రైతులందరికీ వేలం నోటీసులు ఇస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుణమాఫీ డబ్బు ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో జమపడుతుందని, ముందు తమ బాకీ చెల్లించి బంగారం విడిపించుకు వెళ్లమని వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు రైతులకు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 15 నెలలు దాటిన బంగారం రుణం వసూలు చేయాల్సి ఉందని లేదా వేలం వేయాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీ జరగాలంటే ఐదేళ్లు పడుతుందని, అప్పటివరకు బంగారం ఎలా బ్యాంకులో ఉంచుకుంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. తడిసిమోపెడవుతున్న బకాయిలు రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరిగే సమయానికి రైతులపై వడ్డీ భారం పడనుంది. రుణమాఫీ ఆశ లేకుంటే జీరో శాతం వడ్డీపై రుణాలు చెల్లించేవారు. పంట రుణాలు వాయిదా మీరటంతో సహకార బ్యాంకులకు 11 శాతం వడ్డీ భరించాల్సి వస్తుందని బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. ఐదేళ్ల వరకు బకాయి కట్టకపోతే సగానికి సగం వడ్డీ అప్పు పెరుగుతుందని రైతులకు వివరిస్తున్నారు. రైతుల్లో ఆందోళన వాణిజ్య బ్యాంకులు నోటీసులు జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకపక్క చంద్రబాబు బకాయిలు, వడ్డీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటనలు చేస్తుంటే.. మరోపక్క బ్యాంకర్లు నోటీసులు ఇస్తుండటం వారిని దిక్కుతోచని స్థితిలోకి నెడుతోంది.