ప్రైవేట్ రుణమే దిక్కు
అన్నదాతకు అందని రుణాలు
వడ్డీ కట్టించుకుని పునరుద్ధరణతోనే సరి
వాణిజ్య బ్యాంకుల్లో కొనసాగుతున్న తంతు
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడంతోనే ఇబ్బంది
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతోంది. మరో పక్క రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులన్నీ వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేసి పంపించేస్తున్నాయి. కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడమే. అంటే.. పంటల వారీ ఏటా పెంచే రుణపరిమితిని ఈ ఏడాది పెంచలేదు.ఇలా రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతలను వడ్డీ వ్యాపారుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ఇచ్చిన నిధులు ఆయా రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మాఫీ పేరుతో ఇచ్చిన 20 శాతం నిధులు ఆయా రైతుల అప్పులపై ఉన్న వడ్డీకిసరిపోలేదు. దీంతో ఆయా రైతుల రుణాలు గత ఖరీఫ్ సీజన్‌లో రెన్యువల్ కాలేదు. ఈ ఖరీఫ్‌లోనైనా వడ్డీలు చెల్లించి రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే 18 శాతం వరకు వడ్డీ భారం పడుతోందంటూ బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. రైతులు వడ్డీలు చెల్లించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
సహకార బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి
సన్న, చిన్న కారు రైతులకు ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచీ రుణం మంజూరు కావడం లేదు. నాబార్డు ఆప్కాబ్‌కు రుణం మంజూరు చేస్తేనే ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఆ నిధులను ఇస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు ఆ నిధులను ప్రాథమిక సహకార బ్యాంకులకు అందజేస్తాయి. వాటిని ప్రాథమిక సహకార బ్యాంకులు రైతులకు రుణంగా ఇస్తాయి. నాబార్డు రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి దీనికి 0.05 శాతం ఆప్కాబ్ కమిషన్‌గా ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ఆర్థిక స్తోమత లేదని, కమిషన్ లేకుండా గ్యారెంటీ ఇవ్వాల్సిందిగా ఆప్కాబ్ కోరినప్పటికీ ఆర్థిక శాఖ కరుణించడం లేదు.
.