సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి.
ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి.
కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్‌ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి.
నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు
నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు.
సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత
సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాయి.
ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
ప్రత్యేక దృష్టి పెట్టాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్‌పర్సన్, ఆప్కాబ్
Comments
Please login to add a commentAdd a comment