Rural poverty alleviation organization (serp)
-
ఇంధన పొదుపులో మహిళలు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు చెందిన కోటి మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్ములనా సంస్థ (సెర్ప్) తో కలసి రాష్ట్ర ఇంధన శాఖ ఈనెల 16న విజయవాడలో రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహించనుంది. క్షేత్రస్థాయి నుంచి ఇంధన భద్రతను పటిష్టం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఇంధన పొదుపు విభాగం అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు–మహిళల పాత్రకు సంబంధించి రాష్ట్రస్థాయి మహిళా సదస్సు పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంధన సామర్థ్య రంగంలో మహిళల భాగస్వామ్యం దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని మంత్రి అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ సంస్థను కొనియాడారు. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో సెర్ప్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో స్వయం సహాయక సంఘాలు భాగస్వాములయ్యేలా ఒక దీర్ఘకాలిక అమలు ప్రణాళిక రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదిని, సెర్ప్ సీఈవో పి.రాజబాబును మంత్రి ఆదేశించారు. -
ఆర్థిక సాధికారత
సాక్షి, హైదరాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే దేశం ప్రగతి సాధ్యపడుతుంది. మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ కార్యక్రమాల అమలును గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేపడుతోంది. స్థానికంగానే ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా కసరత్తు సాగిస్తోంది. వివిధ రంగాల్లో మహిళలకు ఉపాధి కలి్పంచేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మహిళా గ్రూపుల్లోని వారి సామర్థ్యం, ఆసక్తి మేరకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పీఆర్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా గ్రూపుల ద్వారా వారు నిర్వహించే వ్యాపారాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈసారి భారీగా రుణ సాయం అందించనుంది. గ్రామాల్లో సర్వే... మహిళా సంఘాలకు రుణ సాయం, వాటితో వ్యాపారం చేసే అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో ఎరువుల అమ్మకం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా చేసిన వ్యాపారాలు, లాభాలపై సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూర్‌లో ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం గ్రామాల్లో మహిళా సంఘాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తి నివేదికను సిద్ధం చేసి, వచ్చే నెల నుంచి రుణంæ మంజూరు చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి మహిళా సంఘాల రుణాల మంజూరు అంశాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. మహిళా గ్రూపులకు గుర్తింపు.. బ్యాంకుల నుంచి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు తీసుకోవడం, వాటిని వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి లాభదాయక వ్యాపారం చేయడంలో రాష్ట్ర మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. మహిళా సంఘాలకు ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు, డీసీసీబీల పరిధిలో మొత్తం రూ.6,583 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించారు. నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు ఈ రుణాలిస్తారు. రుణాలతో వ్యవసాయ పనులు.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో మహిళా సంఘాల సభ్యులు ఏఏ పనులు చేస్తున్నారనే అంశంపై సెర్ప్ నిర్వహించిన సర్వేలో పలు వివరాలు వెల్లడయ్యాయి. 2017–18 సంవత్సరం నుంచి మహిళలు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో వ్యవసాయ పనులు చేయడం మొదలుపెట్టారు. తొలి ఏడాది వ్యవసాయ పనుల కోసం రూ.1,561.86 కోట్లు వినియోగించారు. విడుదల చేసిన మొత్తం రుణాల్లో 30.1 శాతం వ్యవసాయ పనులకు ఖర్చు చేశారు. 2018–19 సంవత్సరంలో మొత్తం రూ.807.49 కోట్లు వ్యవసాయానికి వినియోగించారు. మొత్తం రుణాల్లో ఇది 28.7 శాతం. -
ఉద్యోగుల పంపకాలుషురూ
భద్రాచలం , న్యూస్‌లైన్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేరుపడిన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు వేగవంతమయ్యాయి. జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై నివేదికలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడిన వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే ఉద్యోగుల పంపకాల ప్రకియ ఊపందుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్)లో తెలంగాణ జిల్లాల్లో పనిచే స్తున్న 40 మందిని ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న 30 మందిని స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించారు. దీనిలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ఇందిరాక్రాంతి పథం కార్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను వారి స్థానికత ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేస్తూ సెర్ప్ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగా, వీరిలో ఇద్దరి బదిలీల్లో మార్పులు జరిగాయి. భద్రాచలం ఐకేపీ కార్యాలయంలో ఫైనాన్స్ ఏపీఎమ్‌గా పనిచేస్తున్న పీ. రమేశ్‌బాబు, మార్కెటింగ్ ఏపీఎమ్ బీ. శ్రీనివాసులను ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. వేలేరుపాడు మండల ఏపీఎం పద్మావతిని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి, చర్ల ఏపీఎం లక్ష్మీదుర్గను గుంటూరు జిల్లాకు, వీఆర్ పురం ఇన్చార్జి ఏపీఎం సుధాకర్‌ను తూర్పుగోదావరి జిల్లా వై రామవరానికి బదిలీ చేస్తూ సెర్ప్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సుధాకర్ ఒక్క పదోతరగతి మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో చదవగా మిగతా విద్యాభ్యాసంతో పాటు స్థానికంగా కూడా ఖమ్మం జిల్లాకు చెందినవారే. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సెర్ప్ ఉన్నతాధికారులకు అందజేయటంతో అతన్ని ఆంధ్ర ప్రాంతానికి కాకుండా తిరిగి యథాస్థానంలోనే పనిచేసేలా ఆదేశాలిచ్చారు. ఇదే విధంగా చర్ల ఎపీఎం లక్ష్మీదుర్గ బదిలీ ఉత్తర్వులను కూడా మార్పు చేశారు. స్వస్థలం ఆంధ్ర ప్రాంతమే అయినప్పటికీ భర్తది ఖమ్మం జిల్లా కావ టంతో ఆమె విజ్ఞాపన మేరకు తిరిగి చర్లలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో దాదాపు అన్ని శాఖల్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే విధి విధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పనిచేసినా భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవకాశం వస్తే తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ముంపులో గందర గోళం : ఉద్యోగుల పంపకాలకు సంబంధించిన నివేదికలు ఓ పక్క సిద్ధమవుతుండగా, జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా, వీరిని తెలంగాణకురప్పిస్తారా..లేదా అక్కడనే కొనసాగమంటారా అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాల్లో ఒక్క విద్యాశాఖలోనే వివిధ కేడర్లలో 4,107 మంది ఉన్నారు. ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు కలుపుకొని ఇంత మంది పనిచేస్తుండగా, వీరి భవిష్యత్ సర్వీసు అంతా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోతుంది. దీన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముంపులో పనిచేసే వారికి ఆప్షన్ విధానాన్ని కల్పించి వారు కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని టీజేఏసీ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బదిలీలకు అవకాశం ఇవ్వాలి: ముంపు మండలాల్లో ఉద్యోగులు ఎటువైపు అనే దానిపై స్పష్టత లేకపోవటంతో ప్రస్తుతం బదిలీపై తమ కోరుకున్న చోటుకు వచ్చేందుకు అక్కడి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ ఉద్యోగులు తిరుగుతూ ఈ మేరకు విన్నవించుకుంటున్నారు. ఉద్యోగుల పంపకాలపై కేంద్రప్రభుత్వం విధి విధానాలను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ముంపులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఉద్యోగులకు ముందుగానే బదిలీలకు అవకాశం కల్పించాలనే వాదన బలపడుతోంది. జిల్లా అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ముంపు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడి గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.