డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): అందాల పోటీలు రద్దు చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే జైలుకైనా వెళ్తామని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పష్టంచేశాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి అందాల పోటీలను ఆపాలని, లేకుంటే ఆయన ఇంటిని మహిళలు పెద్దఎత్తున ముట్టడిస్తారని హెచ్చరించాయి. మిస్‌వైజాగ్ అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని, మహిళలపై హింసను అరికట్టాలంటూ మహిళా, ప్రజా, రాజకీయ సంఘాల ప్రతినిధులు మంగళవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం మహిళల శరీరాన్ని ఫణంగా పెట్టేలా అందాల పోటీలను తలపెట్టడం సిగ్గుచేటన్నారు. మహిళల శరీరాల్ని ఎరగా వేసి సాధించే అభివృద్ధి మాకొద్దని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సామాజిక భద్రత కల్పించాల్సిన పాలకులు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటూ మహిళలపై హింస పెరగడానికి కారణమయ్యే విధానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అశ్లీల భావజాలాన్ని పెంచి పోషించే అందాల పోటీల పోస్టర్లను మంత్రి గంటా శ్రీనివాసరావే ఆవిష్కరించాడంటే ప్రభుత్వం మహిళల్ని ఏ విధంగా చూస్తుందో అర్థమవుతోందన్నారు.
ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, అందంగా లేని మహిళల జీవితాలు వ్యర్థమని, అందం మార్కెట్‌లో దొరుకుతుందని, అందుకే ఇన్ని కాస్మొటిక్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంతో మంది యువతులు సౌందర్యాత్మక హింసకు గురవుతున్నారని, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖలో హీన సంస్కృతిని పెంచే అందాల పోటీలు, మహిళల శరీర భాగాలను చూపిస్తూ అంగడి సరకుగా దిగజార్చే సంప్రదాయం సరైంది కాదన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమని, మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్టు పోలీసులు వ్యాన్లలోకి ఎక్కించారని, రోడ్లపై లాగి అతి కిరాతకంగా ప్రవర్తించారని వాపోయారు.
ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ చైతన్య వంతమైన ఐక్య పోరాటాలే మహిళా హక్కులకు రక్షణ అని తెలియజెప్పేందుకే రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించామని చెప్పారు. మహిళ సంఘాలపై పోలీసుల దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండిం చాలని కోరారు. మహిళా సంఘాలు, దళిత, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలతో ఐక్యవేదికద్వారా మిస్‌వైజాగ్ అందాల పోటీలు రద్దు చేసేవరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు లలిత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలి న్, ఐద్వా నగర కార్యదర్శి ఆర్.ఎన్.మాధవి, ప్రతినిధులు బి.సూర్యమణి, విజయలక్ష్మి, సీహెచ్ సుమిత్ర, మాణిక్యం, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రతినిధులు ఎం.ఎ.బేగం, వి.లక్ష్మి, నూకాల మ్మ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సిటూ, వర్కింగ్ ఉమెన్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment