Miss Vizag 2017
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
మిస్ వైజాగ్ ఫైనల్‌కి మహిళా సంఘాల సెగ
-
వైజాగ్ అందాలపై ఆందోళన
సాక్షి, విశాఖపట్నం : మిస్ వైజాగ్ అందాల పోటీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. నేటి సాయంత్రం ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో పోటీలను అడ్డుకునేందుకు మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఈ ఏడాదికి గానూ నిర్వాహకులు 26 మంది యువతులను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫైనల్స్ పోటీ నిర్వహించబోతున్నారు. దీనికి మంత్రి గంటా శ్రీనివాస రావు హాజరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు గంటాను కలిసి పోటీలను రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. అంతేకాదు పోటీలకు వెళ్లొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి మాత్రం అధికారులతో మాట్లాడి నిర్ణయం చెబుతాననటం గమనార్హం. మిస్ వైజాగ్ పోటీలపై ప్రారంభం నుంచే వివాదాలు నెలకొన్నాయి. పోటీల ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో కూడా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు తమ ఫిర్యాదు స్వీకరించినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకుండా పోయిందని మహిళా సంఘాలు వాపోతున్నాయి. అత్యాచారాలు జరిగినపుడు నిందితులను చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలు, మహిళలపై నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన మంత్రి ఆధ్వర్యంలోనే అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని వారంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్వహణను అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటంతో పోలీసులు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం. -
అందాల పోటీలు ఆపేవరకు పోరు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): అందాల పోటీలు రద్దు చేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే జైలుకైనా వెళ్తామని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పష్టంచేశాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి అందాల పోటీలను ఆపాలని, లేకుంటే ఆయన ఇంటిని మహిళలు పెద్దఎత్తున ముట్టడిస్తారని హెచ్చరించాయి. మిస్‌వైజాగ్ అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని, మహిళలపై హింసను అరికట్టాలంటూ మహిళా, ప్రజా, రాజకీయ సంఘాల ప్రతినిధులు మంగళవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసం మహిళల శరీరాన్ని ఫణంగా పెట్టేలా అందాల పోటీలను తలపెట్టడం సిగ్గుచేటన్నారు. మహిళల శరీరాల్ని ఎరగా వేసి సాధించే అభివృద్ధి మాకొద్దని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సామాజిక భద్రత కల్పించాల్సిన పాలకులు ఈ బాధ్యత నుంచి తప్పుకుంటూ మహిళలపై హింస పెరగడానికి కారణమయ్యే విధానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అశ్లీల భావజాలాన్ని పెంచి పోషించే అందాల పోటీల పోస్టర్లను మంత్రి గంటా శ్రీనివాసరావే ఆవిష్కరించాడంటే ప్రభుత్వం మహిళల్ని ఏ విధంగా చూస్తుందో అర్థమవుతోందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, అందంగా లేని మహిళల జీవితాలు వ్యర్థమని, అందం మార్కెట్లో దొరుకుతుందని, అందుకే ఇన్ని కాస్మొటిక్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంతో మంది యువతులు సౌందర్యాత్మక హింసకు గురవుతున్నారని, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖలో హీన సంస్కృతిని పెంచే అందాల పోటీలు, మహిళల శరీర భాగాలను చూపిస్తూ అంగడి సరకుగా దిగజార్చే సంప్రదాయం సరైంది కాదన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయించడం దుర్మార్గమని, మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్టు పోలీసులు వ్యాన్లలోకి ఎక్కించారని, రోడ్లపై లాగి అతి కిరాతకంగా ప్రవర్తించారని వాపోయారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ చైతన్య వంతమైన ఐక్య పోరాటాలే మహిళా హక్కులకు రక్షణ అని తెలియజెప్పేందుకే రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించామని చెప్పారు. మహిళ సంఘాలపై పోలీసుల దుశ్చర్యను ప్రతి ఒక్కరూ ఖండిం చాలని కోరారు. మహిళా సంఘాలు, దళిత, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలతో ఐక్యవేదికద్వారా మిస్‌వైజాగ్ అందాల పోటీలు రద్దు చేసేవరకు పోరాడుతామని తేల్చిచెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు లలిత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలి న్, ఐద్వా నగర కార్యదర్శి ఆర్.ఎన్.మాధవి, ప్రతినిధులు బి.సూర్యమణి, విజయలక్ష్మి, సీహెచ్ సుమిత్ర, మాణిక్యం, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధులు ఎం.ఎ.బేగం, వి.లక్ష్మి, నూకాల మ్మ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, సిటూ, వర్కింగ్ ఉమెన్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘అందాల’పై ఆగ్రహావేశాలు
సాక్షి, విశాఖ : అందాల పోటీల పేరిట మహిళలను అర్ధనగ్నంగా చూపించే సంస్కృతిని విశాఖకు తేవద్దని పలు మహిళా సంఘాలు రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. నగరంలోని మద్దిలపాలెంలో ఇవాళ ఉదయం మహిళలు ఆందోళనకు దిగారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తక్షణమే మిస్ వైజాగ్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కాగా అందాల పోటీలు జరుగుతున్న ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్ వద్ద నిన్న (ఆదివారం) ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. పోలీసులు రంగప్రవేశం చేసి మహిళా సంఘాల ప్రతినిధులపై దౌర్జన్యం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సేవ్ గర్ల్ పేరిట నిర్వహించనున్న అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, చైతన్య మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మేఘాలయ హోటల్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను విరమించుకోవాలని పోలీసులు కోరారు. నిర్వాహకులు పోటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తేనే విరమిస్తామని, లేదంటే ధర్నా కొనసాగిస్తామని మహిళా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా హోటలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఓ మహిళా స్పృహ తప్పి పడిపోవడంతో మహిళా సంఘాల నాయకులు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఓ మహిళా సంఘం ప్రతినిధి దుస్తులు చిరిగిపోయాయి. నా దుస్తులు లాగేస్తారా? అంటూ ఆమె పోలీసులతో వాగ్వాదం చేసింది. ఎలాగోలా ఆందోళనకారులను నగరంలోని 2, 3, 4 పట్టణ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలను అంగటి బొమ్మలుగా మారుస్తూ అందాల పోటీలను నిర్వహించడం దారుణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మంత్రి గంటా శ్రీనివాసరావు అండగా ఉండడం సిగ్గు చేటన్నారు. గతంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధి పేరిట బీచ్‌లో బికినీ డ్యాన్స్‌లు నిర్వహించాలని చూశారని, అయితే మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా విశాఖకు బకినీ సంస్కృతిని తీసుకురావద్దని, వెంటనే అందాల పోటీలను రద్దు చేయకపోతే మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే సామాజిక భద్రత కరువై నడిరోడ్డు మీదే పట్టపగలే మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే.. ఇంకా మహిళలను సెక్స్ పరికరాలుగా భావించే శరీర ప్రదర్శన పెట్టడం అన్యాయమన్నారు. సాక్ష్యాత్తు మానవ వనరుల శాఖ మంత్రి గంటా మిస్ వైజాగ్ పోస్టర్‌ను ఆవిష్కరించడం మహిళలను కించపరచడేమన్నారు. క్రియేటివ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, రేస్ ఎంటర్టైన్మెంట్, డ్రీమ్స్ సంస్థలు నిర్వహించ తలపెట్టిన ‘మిస్ వైజాగ్–2017’ అందాల పోటీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తోపులాటలో మహిళా సంఘాల ప్రతినిధులకు, మహిళా పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, సంఘం ప్రతినిధి ఎస్.వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి, చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు లలిత, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. కాగా మహిళల నిరసనతో మిస్ వైజాగ్–2017 పోటీలను రద్దు చేశారు. మహిళాపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి విశాఖే ఓ అందాల సుందరి. ప్రకృతి సౌందర్యంతో అలరారే వయ్యారాల సొగసరి. అలాంటి సుందరి.. సొగసరి అతివల అందాల పోటీలకు ఆలవాలంగా మారుతోంది. గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహించే వారు. కానీ ఇటీవల ఏవేవో పేర్లతో తరచూ వీటిని నిర్వహించే వారు ఎక్కువయ్యారు. ఒకపక్క నగరంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మగువలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. పట్టపగలే, నడిరోడ్డుపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీర్చలేదన్న కక్షతో దారుణంగా హతమార్చేస్తున్నారు. వావి వరసలు, వయసుతో నిమిత్తం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతో శాంతి కాముకంగా పేరున్న నగరం విశాఖ స్మార్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఏ ముహూర్తాన స్మార్ట్ సిటీ అయిందో గాని అప్పట్నుంచి మహిళలపై అకృత్యాలు మరింత అధికమవు తున్నాయని నగర వాసులు తీ\వ్ర ఆవేదన చెందుతున్నారు. ఆడవారిపై అఘాయిత్యాల సంగతి అలా ఉంచితే.. వాటిని అదుపు చేసే, నిలువరించే దిశగా ప్రభుత్వం గాని, అధికారులు గాని, పోలీసులు గాని చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. పైగా నేరప్రవృత్తిని ప్రేరేపించే, అదుపు తప్పేందుకు దోహదపడేలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం మహిళా లోకంలో ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. గతేడాది విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్‌ను సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించడానికి పూనుకుంది. గోవా తరహాలో మహిళలతో మందేసి చిందేయడానికి, స్వదేశీ, విదేశీయులతో తానా తందానా ఆడడానికి సన్నద్ధమైంది. దీనిపై సాక్షి ప్రముఖంగా ప్రచురించడం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం తోకముడిచింది. బీచ్ లవ్ ఫెస్టివల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత అడపా దడపా ఏవేవో పేర్లతో విశాఖలో అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మిస్ వైజాగ్–2017 పేరిట ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. నవంబర్ 11న జరిగే ఈ అందాల పోటీలకు ఆదివారం ఆడిషన్స్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న నగరంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు ఆశీలుమెట్టలోని సంబంధిత హోటల్ వద్దకు చేరుకున్నారు. అందాల పోటీలను రద్దు చేయాలంటూ గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖ సంస్కృతిని నాశనం చేసే ఇలాంటి విశృంఖల పోటీలకు ఆనుమతులివ్వరాదని నినదించారు. అయితే పోలీసులు ఎప్పటిలాగానే ఈ మహిళా ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచి వేసే ప్రయత్నం చేశారు. అదుపు తప్పి ప్రవర్తించారు. వీరిని అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి.. పరోక్షంగా అందాల పోటీల నిర్వాహకుల పక్షాన నిలిచారు. -
మిస్ వైజాగ్ పోటీలను ఆపండి