‘అందాల’పై ఆగ్రహావేశాలు | Women protest against Vizag beauty contest on second day | Sakshi
Sakshi News home page

‘అందాల’పై ఆగ్రహావేశాలు

Published Mon, Oct 30 2017 12:32 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

Women's Association Fires On Miss Vizag Competitions - Sakshi

సాక్షి, విశాఖ : అందాల పోటీల పేరిట మహిళలను అర్ధనగ్నంగా చూపించే సంస్కృతిని విశాఖకు తేవద్దని పలు మహిళా సంఘాలు రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. నగరంలోని మద్దిలపాలెంలో ఇవాళ ఉదయం మహిళలు ఆందోళనకు దిగారు. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తక్షణమే మిస్‌ వైజాగ్‌ పోటీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. కాగా అందాల పోటీలు జరుగుతున్న ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్‌ వద్ద నిన్న (ఆదివారం) ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. పోలీసులు రంగప్రవేశం చేసి మహిళా సంఘాల ప్రతినిధులపై దౌర్జన్యం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

సేవ్‌ గర్ల్‌ పేరిట నిర్వహించనున్న అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య, చైతన్య మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మేఘాలయ హోటల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను విరమించుకోవాలని పోలీసులు కోరారు. నిర్వాహకులు పోటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తేనే విరమిస్తామని, లేదంటే ధర్నా కొనసాగిస్తామని మహిళా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా హోటలో గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఓ మహిళా స్పృహ తప్పి పడిపోవడంతో మహిళా సంఘాల నాయకులు.. పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఓ మహిళా సంఘం ప్రతినిధి దుస్తులు చిరిగిపోయాయి. నా దుస్తులు లాగేస్తారా? అంటూ ఆమె పోలీసులతో వాగ్వాదం చేసింది. ఎలాగోలా ఆందోళనకారులను నగరంలోని 2, 3, 4 పట్టణ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలను అంగటి బొమ్మలుగా మారుస్తూ అందాల పోటీలను నిర్వహించడం దారుణమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మంత్రి గంటా శ్రీనివాసరావు అండగా ఉండడం సిగ్గు చేటన్నారు.

గతంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధి పేరిట బీచ్‌లో బికినీ డ్యాన్స్‌లు నిర్వహించాలని చూశారని, అయితే మహిళా, ప్రజా సంఘాలు ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా విశాఖకు బకినీ సంస్కృతిని తీసుకురావద్దని, వెంటనే అందాల పోటీలను రద్దు చేయకపోతే మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే సామాజిక భద్రత కరువై నడిరోడ్డు మీదే పట్టపగలే మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే.. ఇంకా మహిళలను సెక్స్‌ పరికరాలుగా భావించే శరీర ప్రదర్శన పెట్టడం అన్యాయమన్నారు. సాక్ష్యాత్తు మానవ వనరుల శాఖ మంత్రి గంటా మిస్‌ వైజాగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించడం మహిళలను కించపరచడేమన్నారు.

క్రియేటివ్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రేస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, డ్రీమ్స్‌ సంస్థలు నిర్వహించ తలపెట్టిన ‘మిస్‌ వైజాగ్‌–2017’ అందాల పోటీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. తోపులాటలో మహిళా సంఘాల ప్రతినిధులకు, మహిళా పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, సంఘం ప్రతినిధి ఎస్‌.వెంకటలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఎ.విమల, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి, చైతన్య మహిళా సంఘం ప్రతినిధులు లలిత, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.  కాగా మహిళల నిరసనతో మిస్‌ వైజాగ్‌–2017
పోటీలను రద్దు చేశారు.
మహిళాపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి
విశాఖే ఓ అందాల సుందరి. ప్రకృతి సౌందర్యంతో అలరారే వయ్యారాల సొగసరి. అలాంటి సుందరి.. సొగసరి అతివల అందాల పోటీలకు ఆలవాలంగా మారుతోంది. గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పోటీలు నిర్వహించే వారు. కానీ ఇటీవల ఏవేవో పేర్లతో తరచూ వీటిని నిర్వహించే వారు ఎక్కువయ్యారు. ఒకపక్క నగరంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మగువలపై అత్యాచారాలు, ఆఘాయిత్యాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. పట్టపగలే, నడిరోడ్డుపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీర్చలేదన్న కక్షతో దారుణంగా హతమార్చేస్తున్నారు.

వావి వరసలు, వయసుతో నిమిత్తం లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతో శాంతి కాముకంగా పేరున్న నగరం విశాఖ స్మార్ట్‌ సిటీగా పేరు తెచ్చుకుంది. ఏ ముహూర్తాన స్మార్ట్‌ సిటీ అయిందో గాని అప్పట్నుంచి మహిళలపై అకృత్యాలు మరింత అధికమవు తున్నాయని నగర వాసులు తీ\వ్ర ఆవేదన చెందుతున్నారు. ఆడవారిపై అఘాయిత్యాల సంగతి అలా ఉంచితే.. వాటిని అదుపు చేసే, నిలువరించే దిశగా ప్రభుత్వం గాని, అధికారులు గాని, పోలీసులు గాని చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. పైగా నేరప్రవృత్తిని ప్రేరేపించే, అదుపు తప్పేందుకు దోహదపడేలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం మహిళా లోకంలో ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి.

గతేడాది విశాఖలో బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ను సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించడానికి పూనుకుంది. గోవా తరహాలో మహిళలతో మందేసి చిందేయడానికి, స్వదేశీ, విదేశీయులతో తానా తందానా ఆడడానికి సన్నద్ధమైంది. దీనిపై సాక్షి ప్రముఖంగా ప్రచురించడం, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం తోకముడిచింది. బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత అడపా దడపా ఏవేవో పేర్లతో విశాఖలో అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

అయితే తాజాగా మిస్‌ వైజాగ్‌–2017 పేరిట ఓ బ్యూటీ కాంటెస్ట్‌కు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. నవంబర్‌ 11న జరిగే ఈ అందాల పోటీలకు ఆదివారం ఆడిషన్స్‌ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న నగరంలోని వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు ఆశీలుమెట్టలోని సంబంధిత హోటల్‌ వద్దకు చేరుకున్నారు. అందాల పోటీలను రద్దు చేయాలంటూ గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖ సంస్కృతిని నాశనం చేసే ఇలాంటి విశృంఖల పోటీలకు ఆనుమతులివ్వరాదని నినదించారు. అయితే పోలీసులు ఎప్పటిలాగానే ఈ మహిళా ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణచి వేసే ప్రయత్నం చేశారు. అదుపు తప్పి ప్రవర్తించారు. వీరిని అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించి.. పరోక్షంగా అందాల పోటీల నిర్వాహకుల పక్షాన నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

ఆందోళనకారులను చూసి చిరునవ్వులు చిందిస్తున్న అందాల పోటీల నిర్వాహకులు

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement