దేహాల వ్యాపారం | women's minimum dignity has been disrupted | Sakshi
Sakshi News home page

దేహాల వ్యాపారం

Published Fri, May 26 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

దేహాల వ్యాపారం

దేహాల వ్యాపారం

సందర్భం

అండర్‌వేర్‌ నుంచి జియో వరకు ఏది అమ్మాలన్నా... మార్కెట్‌ అమ్మకాల పుండు నుంచి లాభాల రసి కారాలన్నా... స్త్రీ దేహాన్ని అర్పణ చేయాల్సిందే. స్త్రీ దేహం పురుషుడి చూపుల కొలతల సమాహారం. ఒక మోజు, ఒక ఉద్రేకం.

ఒకానొక సీనియర్‌ సినీ నటుడు చేసిన వ్యాఖ్యలు సమాజ మర్యాదల్ని ఉల్లంఘించాయి. మహిళల కనీస గౌరవానికి భంగం కలిగిం చాయి. కాబట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరాయి. పాపం ఎంత అమాయకులు వీళ్లు. అతను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది. ఉన్నమాటే అన్నాడు కదా అన్నారు కొంతమంది తెలివిపరులు. ఆలోచించి చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. స్త్రీల శరీరాలు ఎందుకు పనికి వస్తాయి? పక్కలోకి.. కదా! అవి మగాళ్లకి.. వారి అవసరాలు తీర్చే భోగ వస్తువులు. వాడుకుని పారేయగల యూజ్‌ అండ్‌ త్రోలు.. అవి వెండితెర మీద కెమెరా కన్నుల్లో కామాన్ని రెచ్చగొట్టగల అంగాంగాలు. కాసుల వర్షం కురిపించే పసిడి దేహాల ఛిద్రమయిన ముక్కలు. స్త్రీ దేహంలోని ప్రతి అణువు కామ కర్మాగారంగా మార్చిపడేసి అంగట్లో సరుకుగా పెట్టిన తర్వాత ఫ్రీ దేహం కాక ఏముం ది... ఆమె మనిషి కాదు.. అమ్మకపు సరుకు.

వెండితెర మీద మెరవడం కోసం తెర వెనకాల చెయ్యిపట్టిన ప్రతివాడికీ దాసోహం అనాల్సిన దేహం. మెట్టు మెట్టుకీ ఈ వెండితెర వైకుంఠ పాళీలో వేలాదిగా రాలిపోతున్న స్త్రీల శరీరాల దొంతరలపైనే ఒకటి రెండు తారలు తళుక్కు మంటాయి. ఈ కొరివి దెయ్యపు తారల గ్లామర్‌ వ్యామోహంలో మిడతల్లా వాలుతూ జూనియర్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ గ్లోరిఫైడ్‌ సెక్స్‌ వర్కర్లుగా జీవితాల్ని కాల్చేసుకునే దేహాలు.

అండర్‌వేర్‌ నుంచి జియో వరకు ఏది అమ్మాలన్నా మార్కెట్‌ అమ్మకాల పుండు నుంచి లాభాల రసి కారాలంటే స్త్రీ దేహాన్ని అర్పణ చేయాల్సిందే. స్త్రీ దేహం పురుషుడి చూపుల కొలతల సమాహారం. ఒక మోజు, ఒక ఉద్రేకం. నిజం ఈ దేహాలు ప్రకృతి స్థిరంగా ఉండే సహజ ప్రేరణలకి అతీతం అయిన అనేక కృత్రిమ ప్రేరణలకి ఆలవాలం. వికృత కోర్కెల విహారానికి కునారిల్లే స్పందనాతీత మాంసపు ముద్ద. ఈ దేహపు గర్భసంచి ఈ దేహాన్ని అపహాస్యం చేసే, అవమానించే ప్రాణులకి జన్మనిచ్చింది. జననాంగాల రాపిడి తప్ప మరో యావ లేని సంతతి ఏకకణ జీవిలాగా బైనరీఫిషన్‌తో లుకలుకలాడుతూ ఈ విజువల్‌ మీడియా మురుగులో వర్ధిల్లుతున్నది. చాలా మామూలుగా జారిపోయిన మాటలు... ఆ కురు సభలో తప్పన్న వారే లేరు. వీరంతా మనకి దృశ్య మాధ్యమ నాయకీ నాయకులు. హార్మోనుల ఒత్తిడి తప్ప బుర్రలోని అన్ని విభాగాలు అనుసంధానం లేని లేత యవ్వనాలకు ఆరాధ్య దైవాలు.

మరో మహా వారసత్వ నటుడు (సామర్థ్యంతో పని లేదు. పెట్టుబడుల అండ ఉంటే.. ఒక్క కండరం కదలకపోయినా, ఉచ్ఛారణ రాకున్నా, బుర్ర లేకున్నా... నాయకులు అవ్వొచ్చని నిరూపితం అవుతున్నది).. ఇంతకీ వీరు ఏమంటారు? వారికి కడుపులు చేసే సామర్థ్యం ఉంది. అలా చేయకుంటే అభిమానులు ఊరుకోరు. పైగా ఇటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా గెలిపించి పంపించే.. గుడ్డి అభిమానం.. ఏది ఏమైనా తమ చుట్టూ ఉన్న స్త్రీలని గిల్లి గిచ్చి హింసిస్తూ చూపరులకు వినోదం పంచుతామని కూడా సెలవిచ్చారట. సినీ రంగానికి వీడ్కోలు పలికి సంతాన సౌభాగ్యం అందరికీ పంచడానికి కమర్షియల్‌ స్టడీ సర్వీసు పెట్టుకుంటే ఎవరికీ గందరగోళం ఉండదు. వీరి ‘మగ సామర్థ్యం’ పట్ల ఫ్యాన్సు ఉప్పొంగి పోతారు.

ఇక అశ్లీలంగా, వెకిలిగా మాట్లాడుతూ దాన్ని వ్యంగ్యంగా, హాస్యంగా నవ్వుకోవాలని ఒక ప్రముఖ హాస్యనటుడి ఉవాచ. కథానాయిక శరీరాలపై కామెంట్లు.. అది కామెడీ... మహిళల హుందాతనాన్ని నీచపరిస్తే కాని వారి శాడిజానికి శాంతి లభించదేమో! ప్రపంచ నియంతల్ని మట్టికరిపించిన అత్యున్నత సృజనాత్మకత ప్రపంచ వెండితెరపై వ్యంగ్యం కొరడా విసిరి నీరాజనాలందుకుందని వీరికి చెప్పడం డ్రైనేజీలో పన్నీరు ఒలకపోయడమే.

ప్రపంచపు శ్రమ మొత్తంలో మూడింట రెండొంతుల పనిభారం మోస్తూ రక్తమాంసాలు ధారపోస్తున్న దేహాలివే. నీకు ఆ దేహం ఒక కామం. కానీ స్త్రీ దేహం జాతిని కొనసాగించే ప్రకృతి వాహకం. నీకు ఆ దేహం 140 ఎమ్‌.ఎమ్‌లో కనబడే జననాంగాల కలయిక. కానీ నిజానికిది నెత్తురూ కన్నీళ్ల వేదనల్లో ప్రతిసృష్టి చేసే యజ్ఞవాటిక. నీకు తల్లి, చెల్లి, బిడ్డలే పవిత్ర దేహాలు కానీ, సర్వం అర్పించే భార్య మాత్రం తృప్తిపరిచే సంతానమిచ్చే యాంత్రిక దేహం.

అవును.. మీరంటున్నట్లు మీరు గుర్తిస్తున్నట్లు మీరు కొలత వేసి ప్రదర్శిస్తున్నట్లు, మీరు అమ్ముకుంటున్నట్లు మీరు అనుభవిస్తున్నట్లు స్త్రీలవి దేహాలే. శ్రమచేసే, ఆలోచించే, జన్మనిచ్చే, అనుభూతించే, ప్రేమించే మానవ దేహాలు, వేయి చేతులతో ప్రపంచాన్ని నిర్మించిన దేహాలు,  పురుషాంగంతో తప్ప మెదడుతో న్యాయంగా హేతుబద్ధంగా ఆలోచించడం మరిచిన అహంకార జీవులను అదుపు చేసే సామర్థ్యం గల దేహాలు. ఈ జగతిని చెక్కి, దారికి తెచ్చిన స్త్రీ దేహాలకు అదేమంత పనికాదు.

పుట్టించడం చేతనయిన ఈ దేహాలకు.. సమాజానికి, నాగరికతకు హానికరం అని నిరూపితం అయితే మట్టగించడం కూడా చేతనవును. హుందాగా, గౌరవంగా, సహచరులుగా బతుకుదామంటే, అణచివేత హింసలతో పాతాళానికి తొక్కుతామంటే.. ప్రతిఘటించటం కూడా చేతనవును ఈ దేహాలకు. లాలించడమే కాదు ఆయుధాలుగా మారగల నిజమైన ప్రాణంగల దేహాలు. కాబట్టి సమ భాగులుగా మర్యాదలు నేర్చుకోకపోతే నేర్పించడం తప్పనిసరి. దండన తప్ప వేరే విధంగా నేర్చుకోమని మొండికేస్తే ఆ మందయినా తాగించవలసి వస్తుంది. ఇది స్త్రీ దేహాల హెచ్చరిక.


దేవి ,వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త
ఈ–మెయిల్‌:padevi@rediffmail.com


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement