సాక్షి, అమరావతి: ‘మిత్ర’ మహిళా సంఘంలో పది మంది సభ్యులున్నారు. వీరంతా ప్రతి నెలా వంద రూపాయల చొప్పున బ్యాంకు పొదుపు ఖాతాకు జమ చేస్తున్నారు. పిల్లలు చదువులు, చిరు వ్యాపారం, కుటుంబ అవసరాలకు ఇది అక్కరకు వస్తుందని ముందుచూపుతో పొదుపు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా వారి ఆశలు నెరవేరటం లేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు ఖాతాలో దాచుకున్న డబ్బులు తీసుకునేందుకు సంఘాలను బ్యాంకులు అనుమతించటం లేదు. రాష్ట్రంలోని మెజారిటీ బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావటం గమనార్హం.
దాచుకున్న డబ్బులున్నా ప్రైవేట్ అప్పులే దిక్కు
ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ కుదరదని తేల్చి ప్రతి మహిళకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా ఇస్తానంటూ మాట మార్చటం తెలిసిందే. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవటంతో పొదుపు కింద బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. మహిళా సంఘాలు సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించడం లేదు. దీంతో పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం మహిళా సంఘాలు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది.
రుణమాఫీ చేయకపోవటమే కారణం
ఒకపక్క బ్యాంకులో వారి డబ్బులుండి కూడా డ్వాక్రా మహిళలకు అప్పు చేయాల్సిన దుస్థితి రావడం శోచనీయమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి, ప్రభుత్వం చెబుతున్న దానికి పొంతన లేదని భేటీలో అధికారులు స్పష్టం చేశారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడమే దీనికంతటికీ ప్రధాన కారణమని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. మహిళా సంఘాల పేరుతో ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయకపోవటంతో అవి అలాగే ఉన్నాయని, పొదుపు ఖాతాల నుంచి సంఘాలకు డబ్బులు ఇచ్చేస్తే రుణాలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
డ్వాక్రా సంఘాలపై చార్జీల మోత
మరోపక్క మెజార్టీ బ్యాంకులు నిర్ధారించిన వడ్డీ కన్నా ఎక్కువకు రుణాలు ఇస్తున్నాయని, వివిధ రకాల చార్జీల పేరుతో సంఘాల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలిందని సమావేశంలో అధికారులు తెలిపారు. కొన్ని బ్యాంకులు మహిళా సంఘాలకు 12.5 శాతం వడ్డీకి, మరి కొన్ని బ్యాంకులు 14.5 శాతం వడ్డీకి రుణాలను ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వివిధ రకాల చార్జీల రూపంలో బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంఘాల నుంచి వసూలు చేస్తున్నాయని వెల్లడైంది. కొన్ని బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో జీవిత బీమా, వైద్య బీమా చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి.
సకాలంలో చెల్లించినా ప్రయోజనం ‘సున్నా’
సకాలంలో అప్పు చెల్లించిన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలను వర్తింప చేయాలి. అయితే 2015 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు సున్నా వడ్డీకి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సకాలంలో రుణాలను చెల్లించిన మహిళా సంఘాలకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కటం లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో మెలగిన రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం కారణంగా నిర్వీర్యం అయ్యే పరిస్థితికి చేరుకున్నాయి.
పొదుపు డబ్బులపై ఆంక్షలు
Published Sun, Nov 26 2017 4:21 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment