రుణగోస | no interest loan scheme | Sakshi
Sakshi News home page

రుణగోస

Published Wed, Dec 3 2014 12:32 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

no interest loan scheme

 నల్లగొండ : ‘వడ్డీలేని రుణాల పథకం’ వికలాంగుల జీవితాలకు భరోసా ఇవ్వడం లేదు. మహిళా సంఘాల తరహాలోనే వికలాంగులు కూడా ఆర్థికంగా మనుగడ సాధించేందుకు ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా  పూర్తిస్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదు.  అక్కడక్కడా సంఘాలుగా ఏర్పడిన వాటికి కూడా రుణాలు అందడం లేదు. దీంతో వివిధ మండలాల్లో కొద్దోగొప్పో ఉన్న సంఘాలు కూడా తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఓవెపు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొఖం చాటేస్తుండగా.. మరోవైపు వికలాంగుల పట్ల ఐకేపీ ఉద్యోగులు చిన్నచూపు చూస్తున్నారు.  2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను పది మండలాల్లోని 480 వికలాంగుల సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణ లక్ష్యం రూ.232.85 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 101 సంఘాలకు గాను కేవలం రూ.82.18 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.
 
 ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగుస్తున్న తరుణంలో ఇంకా 379 సంఘాలకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. సాధారణ సంఘాలతో పోలిస్తే వికలాంగుల సంఘాలకు రుణాలు ఇప్పించడంలో ఐకేపీ ఉద్యోగులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. వికలాంగుల్లో ఆత్మసైర్థ్యాన్ని పెంచి, సంఘాలను సుస్థిర పర్చేందుకు మండలస్థాయిలో పనిచేయాల్సిన వారు సొంత వ్యాపకాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సంఘాల అవసరాలను గుర్తించి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. సంఘాలు పాటించాల్సిన పంచసూత్రాలు పుస్తకాల నిర్వహణ, ప్రతివారం సమావేశాలు, పొదుపులు, సంఘాలకు అప్పులు ఇవ్వడం, తిరిగి వాటిని వసూలు చేయడం వంటి సూత్రాలను సంఘాలు పాటిస్తున్నాయా! లేదా! అన్నది మండల సిబ్బంది పర్యవేక్షించాలి.  కానీ విధులను గాలికి వదిలేసిన ఉద్యోగులు  వికలాంగుల అవసరాల వైపు  కన్నెత్తి కూడా చూడడం లేదు.
 
 దీంతో సంఘాలకు  ప్రభుత్వం ఇచ్చే సీఐఎఫ్ (సామాజిక పెట్టుబడి నిధి) మినహా బ్యాంకుల నుంచి పావలా వ డ్డీ రుణాలు అందడం లేదు. వాస్తవానికి ప్రారంభ దశలో ఉన్న  సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రివాల్వింగ్ ఫండ్ కింద సీఐఎఫ్ ఇస్తారు.  దీన్ని సంఘాలు రొటేషన్ చేసుకుంటూ ఆర్థిక పరిపుష్టి సాధించాలి. కానీ చాలా రకు సంఘాలు తీసుకోవడమేగానీ, మండల సమాఖ్యలకు తిరిగి చె ల్లించడం లేదు. సీఐఎఫ్ రికవరీ, సంఘాల పనితీరును పట్టించుకోకుండా తప్పుడు వివరాలతో నెలవారీ ప్రగతి నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతినెలా వికలాంగుల సంఘాల ప్రగతి నివేదికను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలో మండలాలకు సంబంధించిన రిపోర్ట్‌లో ఒకటి, రెండు చిన్న చిన్న మార్పులు చేసి పాత రిపోర్ట్‌ను తిప్పి పంపుతున్నట్టు సమాచారం.
 
 నిరాదరణకు గురవుతున్న వికలాంగులు
 వికలాంగుల సంఘాలు నిరాదరణకు గురవుతున్నాయి. ఆసరా పథకం కింద పింఛన్ పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 49,656 మంది అర్హత సాధించారు.  సదరమ్ లెక్కల ప్రకారం జిల్లాలో 36,968 మంది వికలాంగులు ఉన్నారు.  వీరిలో 17,057 మంది సభ్యత్వం తీసుకోగా, 2,230 సంఘాలు  ఏర్పడ్డాయి. దీంట్లో బ్యాంకు ఖాతా కలిగిన సంఘాలు 2,186. ఇక ఐకేపీ పంచసూత్రాల ప్రకారం బుక్‌కీపింగ్ నిర్వహిస్తున్న సంఘాలు 2,070 ఉన్నాయి. అత్యధికంగా మునగాల క్లస్టర్‌లో 3,768 మంది వికలాంగులు ఉంటే కేవలం 214 మంది సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యాయి.  దేవరకొండ క్లస్టర్ పరిధిలో 3,140 మంది వికలాంగులకుగాను కేవలం 158 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. తుంగతుర్తి క్లస్టర్ పరిధిలో 3,534 మంది వికలాంగులకుగాను కేవలం 245 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. వలిగొండ, నిడమనూరు, హుజూర్‌నగర్, భువనగిరి, చండూరు, నకిరేకల్, నార్కట్‌పల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement