No Interest Loan Scheme
-
అన్నదాతకు ఆసరా.. వైఎస్సార్ రైతు భరోసా
పొలం సాగు చేయాలంటే పుస్తెలు తాకట్టుపెట్టాల్సిన దుస్థితి. సాగు పెట్టుబడులకు బ్యాంకులు రుణాలివ్వక, బయట మార్కెట్లో అప్పులు చిక్కక రైతులు ఏటా భార్యల మెడలోని పుస్తెలు తాకట్టు పెట్టే దీనస్థితి. ఆ ఏడు పంట పండకుంటే తనఖా పెట్టిన ఆ పుస్తెలు వేలానికి వెళ్లే పరిస్థితి. ఇంతటి దీనస్థితిలో ఉన్న రైతులకు ఆసరాగా ఉండేందుకు జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వైఎస్సార్ భరోసా పథకంపై రైతులు సర్వత్రా హర్షం వ్యకం చేస్తున్నారు. ఈ పథకం తమకు రైతులకు కొండ ధైర్యానిస్తోంది. జగనన్న వస్తేనే తమ జీవితాలు బాగుపడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): నవరత్నాల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన వైఎస్సార్ రైతు భరోసా కోట్లాది రైతన్నలకు ఆసరాగా నిలవనుంది. వర్షాభావ పరిస్థితులు, కరువు, పెట్టుబడి అప్పులు, కష్టాల బాటలో పయనిస్తున్న రైతులకు అండగా నేనున్నానంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రైతు భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు సీజన్లో పంట సాగుకు ముందే గిట్టుబాటు ధర ప్రకటన, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, వడ్డీలేని రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి, శీతల గిడ్డంగుల ఏర్పాటు వంటి పలు ప్రయోజనాలు చేకూరుస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రైతాంగం ఆయనకు నీరాజనం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అన్నదాతలు గత ఐదేళ్లుగా అవస్థలు పడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఈ నగదు కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు. కాని ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము జమకాక పోవడంతో రైతులు నెలల కాలంగా ఎదురుచూశారు. తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వారి ఆశలు నెరవేరలేదు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్రెడ్డి తన ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎంతో ప్రయోజనం రైతు భరోసా పథకం వల్ల ప్రతి రైతుకు ప్రయోజనం కలుగుతుంది. సీజన్ ప్రారంభంలో ప్రతి ఏటా సాగు ఖర్చులకు రూ.12500 ఇస్తామని చెప్పడం ఆనందదాయకం. దీని వల్ల రైతులు పెట్టుబడి ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం అందించే సొమ్ముతో సాగు పెట్టుబడి లభిస్తుంది. - శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, సుంకిరెడ్డిపాలెం వడ్డీ లేని రుణాలు లభిస్తాయి ప్రస్తుతం రైతులు పంట రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. దీంతో పాటు పంటల బీమా కోసం ఇచ్చే రుణంలో కొంత సొమ్ము తీసుకుంటున్నారు. జగన్ ప్రకటించిన వైఎస్సార్ రైతు భరోసా వల్ల వడ్డీ లేని రుణాలు అందుతాయి. వ్యవసాయ బోర్లకు సైతం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. పగటి పూట తొమ్మిది గంటలు కరెంట్ సరఫరా చేస్తాననడం హర్షణీయం. - పోకూరి రవణయ్య, రైతు, రావులకొల్లు -
జీరోవడ్డీతో పంట రుణాలు
బషీరాబాద్(తాండూరు): జిల్లా సహకార సంఘం నుంచి నావంద్గి సొసైటీకి రూ. కోటి పంట రుణాలు మంజూరు అయినట్లు పీఎసీఎస్ చైర్మన్, జిల్లా సహకార సంఘం డైరెక్టర్ అల్వీన్ అనంత్‌రెడ్డి తెలిపారు. సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతీ రైతుకు లక్ష రూపాయల వరకు రుణపరిమితితో జీరోవడ్డీపై పంట రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆయన బషీరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో డీసీసీబీ జీరోవడ్డీతో రుణాలు ఇస్తుందన్నారు. నావంద్గి సహకార సంఘంలో4,227 మంది రైతులు ఉన్నారని, వీరిలో గతేడాది 1500 మంది రైతులకు రూ.5కోట్ల స్వల్పకాలిక రుణాలు, 300 మందికి రూ.1.50కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతంలో తీసుకున్న రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకు వారం రోజుల్లో కొత్త రుణాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు క్రాప్‌లోన్ తీసుకోని రైతులు కొత్త పాసుపుస్తకం, పహాణి నఖల్‌తో వస్తే రుణాలు ఇస్తామని చెప్పారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి సహకారంతో బషీరాబాద్ మండలానికి అధిక రుణాలు రాబట్టినట్లు చెప్పారు. రైతుల కోసం డీసీసీబీ నుంచి ఎన్ని నిధులైనా తీసుకువస్తామని చైర్మన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రూ.కోటి పంట రుణాలు మంజూరు చేసిన డీసీసీబీ చైర్మన్‌కు అనంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ వెంకటయ్య పాల్గొన్నారు. -
రుణగోస
నల్లగొండ : ‘వడ్డీలేని రుణాల పథకం’ వికలాంగుల జీవితాలకు భరోసా ఇవ్వడం లేదు. మహిళా సంఘాల తరహాలోనే వికలాంగులు కూడా ఆర్థికంగా మనుగడ సాధించేందుకు ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేయాలి. అయితే ఆ దిశగా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు జరగడం లేదు. అక్కడక్కడా సంఘాలుగా ఏర్పడిన వాటికి కూడా రుణాలు అందడం లేదు. దీంతో వివిధ మండలాల్లో కొద్దోగొప్పో ఉన్న సంఘాలు కూడా తమ ఉనికిని కోల్పోతున్నాయి. ఓవెపు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొఖం చాటేస్తుండగా.. మరోవైపు వికలాంగుల పట్ల ఐకేపీ ఉద్యోగులు చిన్నచూపు చూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను పది మండలాల్లోని 480 వికలాంగుల సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రుణ లక్ష్యం రూ.232.85 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 101 సంఘాలకు గాను కేవలం రూ.82.18 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగుస్తున్న తరుణంలో ఇంకా 379 సంఘాలకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. సాధారణ సంఘాలతో పోలిస్తే వికలాంగుల సంఘాలకు రుణాలు ఇప్పించడంలో ఐకేపీ ఉద్యోగులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. వికలాంగుల్లో ఆత్మసైర్థ్యాన్ని పెంచి, సంఘాలను సుస్థిర పర్చేందుకు మండలస్థాయిలో పనిచేయాల్సిన వారు సొంత వ్యాపకాల మీదనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. సంఘాల అవసరాలను గుర్తించి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించి బ్యాంకుల సహకారంతో రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. సంఘాలు పాటించాల్సిన పంచసూత్రాలు పుస్తకాల నిర్వహణ, ప్రతివారం సమావేశాలు, పొదుపులు, సంఘాలకు అప్పులు ఇవ్వడం, తిరిగి వాటిని వసూలు చేయడం వంటి సూత్రాలను సంఘాలు పాటిస్తున్నాయా! లేదా! అన్నది మండల సిబ్బంది పర్యవేక్షించాలి. కానీ విధులను గాలికి వదిలేసిన ఉద్యోగులు వికలాంగుల అవసరాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే సీఐఎఫ్ (సామాజిక పెట్టుబడి నిధి) మినహా బ్యాంకుల నుంచి పావలా వ డ్డీ రుణాలు అందడం లేదు. వాస్తవానికి ప్రారంభ దశలో ఉన్న సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రివాల్వింగ్ ఫండ్ కింద సీఐఎఫ్ ఇస్తారు. దీన్ని సంఘాలు రొటేషన్ చేసుకుంటూ ఆర్థిక పరిపుష్టి సాధించాలి. కానీ చాలా రకు సంఘాలు తీసుకోవడమేగానీ, మండల సమాఖ్యలకు తిరిగి చె ల్లించడం లేదు. సీఐఎఫ్ రికవరీ, సంఘాల పనితీరును పట్టించుకోకుండా తప్పుడు వివరాలతో నెలవారీ ప్రగతి నివేదికలు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతినెలా వికలాంగుల సంఘాల ప్రగతి నివేదికను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు పంపాల్సి ఉంటుంది. ఈ నివేదికలో మండలాలకు సంబంధించిన రిపోర్ట్‌లో ఒకటి, రెండు చిన్న చిన్న మార్పులు చేసి పాత రిపోర్ట్‌ను తిప్పి పంపుతున్నట్టు సమాచారం. నిరాదరణకు గురవుతున్న వికలాంగులు వికలాంగుల సంఘాలు నిరాదరణకు గురవుతున్నాయి. ఆసరా పథకం కింద పింఛన్ పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 49,656 మంది అర్హత సాధించారు. సదరమ్ లెక్కల ప్రకారం జిల్లాలో 36,968 మంది వికలాంగులు ఉన్నారు. వీరిలో 17,057 మంది సభ్యత్వం తీసుకోగా, 2,230 సంఘాలు ఏర్పడ్డాయి. దీంట్లో బ్యాంకు ఖాతా కలిగిన సంఘాలు 2,186. ఇక ఐకేపీ పంచసూత్రాల ప్రకారం బుక్కీపింగ్ నిర్వహిస్తున్న సంఘాలు 2,070 ఉన్నాయి. అత్యధికంగా మునగాల క్లస్టర్లో 3,768 మంది వికలాంగులు ఉంటే కేవలం 214 మంది సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. దేవరకొండ క్లస్టర్ పరిధిలో 3,140 మంది వికలాంగులకుగాను కేవలం 158 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. తుంగతుర్తి క్లస్టర్ పరిధిలో 3,534 మంది వికలాంగులకుగాను కేవలం 245 సంఘాలు మాత్రమే ఏర్పడ్డాయి. వలిగొండ, నిడమనూరు, హుజూర్నగర్, భువనగిరి, చండూరు, నకిరేకల్, నార్కట్‌పల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. -
రుణ పరిమితి పెంపుపై రెండ్రోజుల్లో నిర్ణయం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి కే.తారకరామారావు సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) వడ్డీలేని రుణాల పరిమితి మొత్తాన్ని పెంచడం, బంగారు తల్లి పథకం కొనసాగింపుపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) వెల్లడించారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యం తీసుకుంటారని చెప్పారు. శుక్రవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సుధీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాలకు ప్రస్తుతమున్న రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచితే పడే భారమెంతో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం(ఎన్ఆర్ఎల్పీ) కింద రూ. 450 కోట్ల నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరిం చారు. అలాగే ‘సెర్ప్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవల అందించడానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,000 కోట్ల ఆర్థిక సాయం తీసుకోనున్నట్లు చెప్పారు. పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధుల కోసం షెల్టర్లు నిర్వహించే యోచన చేస్తున్నామని తెలిపారు. మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను వారే విక్రయించుకోవడానికి వీలుగా ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలో ‘కృషి’ మార్ట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళలను వడ్డీ కట్టాలని బ్యాంకులు లేదా స్త్రీనిధి సంస్థ ఒత్తిడి తేరాదని చెప్పారు. అధికారులను నిలదీసిన మంత్రి: కాగా, సెర్ప్ కార్యకలాపాలు ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాల్లో తలదూర్చేలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. సెర్ప్ ఓ సమాంతర ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... ఇతర శాఖలు సరిగా పనిచేయని పక్షంలో అవసరమైన సహకారాన్ని మాత్రమే అందించాలని ఆయన అధికారులకు సూచించారు. స్త్రీనిధి డివిడెండ్: స్త్రీనిధి సంస్థ ప్రభుత్వానికి 98 లక్షల రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మొత్తాన్ని సంస్థ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి ప్రభుత్వానికి అందచేశారు.