ఆలీబాబా..ఆరుగురు దొంగలు!
- అధికారికంగా గంగలాపురంలో రీచ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- దానికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అక్రమ తవ్వకాలు
- ‘రచ్చుమర్రి’ ఇసుక మాఫియాలో ఆరుగురు టీడీపీ నేతలే కీలకం
- టీడీపీ ‘ముఖ్య’నేత సూచనతో ‘పచ్చ’దందా
- ఎన్నికల ఖర్చు రాబట్టుకునేలా ప్రణాళిక
- ఒకటిన్నర నెలలో రూ.6 కోట్లు గడించిన నేతలు
అనంతపురం టౌన్ : అధికారదర్పంతో తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు. వేదవతికి వేదన మిగిల్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. మహిళా సంఘాలకు ఎప్పుడైతే ఇసుక రీచ్‌లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారో అప్పటి నుంచి అందినకాడికి తవ్వుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన డబ్బును వీలైనంత తొందరగా రాబట్టుకునేందుకు ఇసుక మాఫియాగా ఏర్పడ్డారు. రాత్రికి రాత్రి తోడేసి సరిహద్దులు దాటించారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం రచ్చుమర్రి వద్ద గ్రామస్తుల సమాచారంతో దాడులు చేసి ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 15 మందిని అరెస్ట్ చేయగా సోమవారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆలీబాబా.. ఆరడజను దొంగల తరహాలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సహకారం అందించగా ఆరుగురు టీడీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అందినకాడికి దండుకున్నారు.
ఒకటిన్నర నెలలో రూ.6 కోట్ల ఆదాయం
కణేకల్లు మండలంలోని వేదవతి హగిరి ఇసుక చాలా నాణ్యతగా ఉంది. ఈ ఇసుకకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం గంగలాపురం గ్రామంలో ఇసుకరీచ్ ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో రచ్చుమర్రి అనే గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో ఇసుకతోడేస్తే ఎవరికీ అనుమానం రాదని అనుకొన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకదందాకు ఇదే అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. సుమారు నెలన్నరగా ఇసుకదందాను సాగిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చులు భరించామని అందుకు పదిరెట్లు తమ సంపాందించేలా దారి చూపాలని ఈ ప్రాంతంలోని నేతలు ‘ముఖ్య’నేతను కోరడంతో ఆయనే ఇసుకదందాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాజు అనుగ్రహం తోడుకావడంతో ఇక అడ్డెవరంటూ ఆరుగురు నేతలు రెచ్చిపోయారు. రచ్చుమర్రిలో లోడ్ చేసుకొన్న వాహనాలు ఆదిగానిపల్లి, వేపరాలక్రాస్ మీదుగా రాయదుర్గం చేరుకుని అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దుకు చేరుకుంటున్నాయి. ఒకటిన్నర నెల వ్యవధిలోనే సుమారు రూ.6 కోట్ల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది.
పోలీస్ అధికారికి బంపర్ ఆఫర్
ఇసుక అక్రమ రవాణ చేస్తూ శనివారం రాత్రి వాహనాలు పట్టుబడటంతో టీడీపీ నేతలు అవాక్కయారు. బయటపడేందుకు ఓ పోలీస్ అధికారికి రూ.5 లక్షలు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే వాహనాలు వదిలేస్తే తన ఉద్యోగానికే ముప్పని.. ఒప్పుకొనేది లేదని ఆ అధికారి చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించినట్లు తెలిసింది. కాగా కొద్ది రోజుల క్రితమే ఆరుగురు టీడీపీ నేతలు రెవెన్యూ, పోలీసు అధికారులకు ‘మామూలు’గా గాలం వేసినట్లు తెలిసింది. అంతాసవ్యంగా జరిగితే ఎవరివాటా వారికిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇదిలావుండగా సోమవారం అధికారుల విచారణ కూడా తూతూమంత్రంగా సాగినట్లు తెలుస్తోంది.