ఊరట.. నిట్టూర్పు..! | Womens Association Loans Money Pending Adilabad | Sakshi
Sakshi News home page

ఊరట.. నిట్టూర్పు..!

Published Wed, Aug 22 2018 11:33 AM | Last Updated on Wed, Aug 22 2018 11:33 AM

Womens Association Loans Money Pending Adilabad - Sakshi

డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు(ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: డ్వాక్రా మహిళలకు రెండేళ్ల వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. ఇది ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాల) సభ్యులకు ఊరటనిచ్చేదే.. అయితే వారం రోజులు పైబడ్డా ఆ రాయితీ నిధులు గ్రూపు ఖాతాల్లో జమ కాలేదు. మూడేళ్ల తర్వాత వడ్డీ నిధులు వచ్చాయని సంబరపడుతున్న మహిళా సంఘాలకు తమ గ్రూపు ఖాతాలో జమ కాకపోవడంతో ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలన్న నిట్టూర్పు కనిపిస్తోంది. మరోపక్క మూడేళ్ల వడ్డీ రావాల్సి ఉండగా, రెండేళ్ల నిధులను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం మరో ఏడాది డబ్బుల కోసం మహిళా సంఘాలను నిరీక్షించేలా చేసింది. దీంతో ఆ డబ్బులు ఎప్పుడొస్తాయోనని వారు ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏటేటా జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థిక స్వాలంబన సాధించే విషయంలో బ్యాంకులు, ఐకేపీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
రెండేళ్ల వడ్డీ నిధులు విడుదల..
మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉండగా, వారం రోజుల క్రితం ప్రభుత్వం 2015–16, 2016–17కు సంబంధించిన నిధులు మాత్రమే విడుదల చేసింది. 2017–18కు సంబంధించి వడ్డీ రాయితీ డబ్బులను విడుదల చేయకపోవడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రుణం తీసుకొని ప్రతినెల సక్రమంగా చెల్లించినప్పటికీ ప్రభుత్వం వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా ఇలా సంవత్సరాల తరబడి నాన్చడంతో సంఘం సభ్యులు ఆర్థికంగా ప్రయోజనం పొందలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీఓ జారీ చేసింది.

దీంతో ఇక ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆశిస్తున్న సభ్యులకు నిరీక్షణే నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ సెర్ప్‌ ఖాతాల్లో ఇంకా జమకాలేదని అధికారులు చెబుతున్నారు. వారి ఖాతాల్లో జమ అయిన తర్వాత అక్కడి నుంచి బ్యాంక్‌ ఖాతాల్లోకి రావడం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా 2015–16లో 4,790 ఎస్‌హెచ్‌జీలకు రూ.52.62 కోట్ల రుణాలు బ్యాంకులు, ఐకేపీ నుంచి ఇచ్చారు. 2016–17లో 6,131 ఎస్‌హెచ్‌జీలకు రూ.75.46 కోట్లు ఇచ్చారు. 2017–18లో 6,641 ఎస్‌హెచ్‌జీలకు గాను లక్ష్యం రూ.122.62 కోట్లు ఉండగా, రూ.88 కోట్లు రుణాల కింద ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.6 కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు ఎస్‌హెచ్‌జీలకు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు సంవత్సరాలయే విడుదల అయ్యాయి. ఇచ్చిన రుణాలపై పరిగణనలోకి తీసుకుంటే 2017–18కి సంబంధించే ఎస్‌హెచ్‌జీలకు అధికంగా సుమారు రూ.మూడున్నర కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు జమ కావాల్సి ఉంది.

బ్యాంక్‌ లింకేజీకి  అర్హత సాధిస్తేనే..
మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి సంబం ధించి ప్రతినెలా కిస్తులు సక్రమంగా చెల్లించడంతోపాటు రుణాన్ని పూర్తిగా చెల్లించిన పక్షంలో అవి బ్యాంక్‌ లింకేజీకి అర్హత సాధిస్తాయి. తద్వారా ఆ సంఘాలు రుణ సదుపాయాన్ని పొందుతాయి. మహిళా సంఘాల పొదుపు, చెల్లింపులు సక్రమంగా ఉన్నప్పుడే ఈ సంఘాలు మనుగడ సాధి స్తాయి. ఈ సంఘాలకు ఈ రెండు అంశాల ఆధారంగా గ్రేడింగ్‌ కేటాయిస్తూ రుణ సదుపాయాన్ని పెంచడం జరుగుతుంది. ఈ సంఘాల రుణ చెల్లింపులకు సంబంధించి పూర్తిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదవుతాయి. తద్వారా సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలు వడ్డీ రాయితీకి అర్హత సాధి స్తాయి. మిగతా సంఘాలు బ్యాంక్‌ లింకేజీ కోల్పో యి రుణ సదుపాయానికి దూరమవుతాయి.

జిల్లాలో ప్రతియేటా సంఘాలతోపాటు సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుండడం ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తుంది. జిల్లాలో వ్యవసాయ ఆధారంగానే అధికంగా మహిళలు రుణాలు పొందడంతోపాటు చెల్లింపులు చేస్తారు. దీంతో వ్యవసాయంలో నష్టాలు సంభవించినప్పుడు రుణ చెల్లింపులో జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతేడాదికి ఈయేడాదికే సుమారు 350 సంఘాలు రుణ అర్హతను కోల్పోవడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రధానంగా ఒక సంఘం బ్యాంకులో చేసే పొదుపుపై మూడింతలు అధికంగా రుణం ఇవ్వడం జరుగుతుంది. రుణానికి సంబంధించి మొదట వడ్డీతోపాటు మహిళా సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రీపేమెంట్‌ సక్రమంగా ఉన్న పక్షంలో ఆ సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

ఆర్థిక పరిపుష్టి ఏది..
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుక బడడం, సంఘాల కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. 

ఖాతాల్లో జమ కావాల్సి ఉంది..
మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి సెర్ప్‌ ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్‌ ఖాతాల్లో ఎస్‌హెచ్‌జీలకు రావడం జరుగుతుంది. మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో రూ.6కోట్లకు పైగా వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.2.95 కోట్లు రెండేళ్లకు సంబంధించి విడుదల చేశారు. మరో రూ.3 కోట్లకు పైగా రావాల్సి ఉంది.

– రాజేశ్వర్‌ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement