మద్యం ఫుల్లు...మంచినీళ్లు నిల్లు
- 29 మద్యం టెండర్లను అడ్డుకుంటాం...
- మండిపడ్డ మహిళా సంఘాలు..
- నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతుల దహనానికి యత్నం
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతితో పాటు పలువురు అరెస్టు
విశాఖపట్నం (డాబాగార్డెన్స్) : ‘మద్యం పారించి ఖజానాని నింపుకొంటావా..? జనాభా ప్రాతిపదికన మద్యాన్ని
పెడతానంటున్నావ్..అదే జనాభా ప్రాతిపదికన మంచినీళ్లు అందివ్వగలుగుతున్నావా....గృహాలు నిర్మించగలుగుతున్నావా? షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలా? సిగ్గు సిగ్గు...అంటూ మహిళా సంఘాలు నూతన మద్యం పాలసీపై విరుచుకుపడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి వైఎస్సార్ విగ్రహ కూడలి మీదుగా జగదాంబ జంక్షన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శనలో ‘బాబూ...మాకు జాబులు కావాలి, మద్యం షాపులు కాదు, మద్యం అమ్మకాలను పెంచొద్దు..కుటుంబాలను నాశనం చెయ్యొద్దు...’ అంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్లో నూతన ఎక్సైజ్ పాలసీ జీవో ప్రతులను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దానిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఘర్షణ తలెత్తింది. ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తున్న పలువురు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం లభించే విధంగా ప్రతి మండలానికి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టే విధంగా ఈ పాలసీ ఉండడం దుర్మార్గమన్నారు. మద్యం వల్ల తల్లి, భార్య, చెల్లి, కన్నకూతురు అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ప్రజల జీవితాన్ని చిధ్రం చేస్తున్నా...ఆ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన ప్రభుత్వాలు ఆదాయమే ప్రధానంగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల మాట్లాడుతూ సారా కాంట్రాక్టర్లు, మద్యం సిండికేట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వారే అవుతున్నారని ఆరోపించారు.
ఈ నెల 29న జరగనున్న మద్యం టెండర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు బి.పద్మ, ఆర్‌ఎన్ మాధవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.ద్రాక్షాయణి, కె.నాగమణి, పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర, వెంకటలక్ష్మీ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు బేగం, ఐద్వా నాయకులు ఎ.వి.పద్మావతి, ఎం.సుజాత, కె.వి.సూర్యప్రభ, బి.సూర్యమణి, పుష్ప, ఆర్.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.