- 12న నిర్వహించేందుకు ఏర్పాట్లు: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ద్వారా ఒకేరోజున కోటి మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ప్), గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 2.50 కోట్ల గుంతలను ఉపాధిహామీ కూలీలతో ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు.
అన్ని జిల్లాల్లోని ఆయా నర్సరీల నుంచి ఎంపీడీవోల ద్వారా ప్రతి గ్రామానికి మొక్కలను పంపిణీ చే శామని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగల మాదిరిగా మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామ ప్రధానకూడలిలో ఉండే మొక్కలను ఊరేగింపుగా తీసికొని ఉత్సాహభరిత వాతావరణంలో గుంతల వద్దకు చేర్చాలని సూచించారు. ఎస్‌హెచ్‌జీల్లోని ప్రతి సభ్యురాలు కనీసం 10 మొక్కలు నాటాలని అన్నారు. కోటి మొక్కల హరితహారాన్ని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, డీపీవోలు, ఎంపీడీవోలను మంత్రి కృష్ణారావు ఆదేశించారు.
ఒకేరోజు కోటి మొక్కల హరితహారం
Published Sun, Jul 10 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement