స్వశక్తి సంఘాల మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు
Published Wed, Aug 10 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
చిగురుమామిడి : రాష్ట్రంలో స్వశక్తి మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనిధి రాష్ట్ర మేనేజంగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం చిన్నముల్కనూర్‌లో స్వశక్తి సంఘ మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ మైక్రో, టిన్నీల కింద రూ.600 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రో పథకం కింద ప్రతి మహిళకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు, టిన్నీ కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల స్వశక్తి సంఘాలకు 2.25 లక్షల సంఘాలకు స్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతేడాది 99శాతం రికవరీ సాధించగా.. కరీంనగర్ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ సంవత్సరం 20వేల పాడిపశువుల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రుణాల మంజూరు, రికవరీ పారదర్శకంగా ఉండేందుకు ఆధార్‌కార్డుల లింకేజీకి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల శ్రీనిధి డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. డీజీఎం ఎల్లయ్య, ఏజీఎం రవికుమార్, హుస్నాబాద్ ఏసీ శ్రీనివాస్, ఏపీఎం సంపత్, సీసీలు సంపత్, వెంకటమల్లు, వెంకటేశ్వర్లు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Advertisement