chigurumamidi
-
ప్రేమ వ్యవహారం.. యువకుడి కుటుంబంపై యువతి బంధువులు కత్తితో దాడి
సాక్షి, కరీంనగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలంలో ఓ యువకుడి కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుడితోపాటు ఆమె తల్లి, తండ్రిని కత్తితో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారంతోనే యువతి బంధువులు కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిగురుమామిడి మండలానికి చెందిన చందు అనే యువకుడు జగిత్యాలకు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న యువతి అన్నయ్య.. తన స్నేహితులతో కలిసి చందు కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడితో పాటు అతడి తండ్రి శ్రీనివాస్, తల్లి స్వప్నకు కూడా గాయాలయ్యాయి. అంతేగాక చందు శరీరంలోనే కత్తి చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం -
కరీంనగర్: కలకలం రేపిన నాటుకోళ్ల మృతి
సాక్షి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లాలో నాటు కోళ్ల మృతి కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో వెయ్యికి పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రైతు తిరుపతి 1500 నాటు కోళ్ళు పెంచుతున్నారు. నిన్నటి నుంచి 24 గంటల వ్యవధిలో భారీ సంఖ్యలో కోళ్ళు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో.. బర్డ్ ప్లూ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా కోళ్ల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.(చదవండి: వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం) సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడడంతో రైతు తిరుపతికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు నాలుగు లక్షల మేర నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు. ఇక వికారాబాద్ జిల్లాలో సైతం వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోతున్న సంగతి తెలిసిందే. కోళ్లతోపాటు కాకులు కూడా మృతి చెందుతుండటంతో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. -
తహసీల్ సిబ్బందిపై పెట్రో దాడి
చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పెట్రోల్ దాడి ఘటన కలకలం సృష్టించింది. పట్టా పాసు పుస్తకంలో తన పూర్తి భూమి నమోదు కాలేదని ఆగ్రహించిన ఓ రైతు సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. అగ్గి పుల్ల అంటించేలోపే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని లంబాడిపల్లికి చెందిన జీల కనుకయ్యకు ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 1142, 1145, 1146లో 4.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 0.19 గుంటలు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైంది. మిగతా 4.0 ఎకరాల కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం లేనిదే వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రెండ్రోజుల క్రితం వీఆర్ఓ శంకర్‌ను సంప్రదించగా.. 4.19 ఎకరాలకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చాడు. సింగిల్ విండో అధికారికి చూపించగా.. ఇది చెల్లదని చెప్పడంతో రైతు కనుకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం తహసీల్దార్‌ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించగా.. గేటు వద్ద వీఆర్ఏ అడ్డుకున్నాడు. దీంతో బయటకు వెళ్లిన ఆయన రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి సీని యర్ అసిస్టెంట్ రాంచందర్‌రావు, వీఆర్ఏలు నర్స య్య, అనిత, అటెండర్ దివ్యలపై పోశాడు. అగ్గి పెట్టె తీసేలోపే సిబ్బంది కనుకయ్యను బయటకు లాక్కెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, రూరల్ ఏసీపీ పార్థసారథి, ఎల్ఎండీ సీఐ మహేశ్‌గౌడ్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏనాడూ కలవలేదు : తహసీల్దార్ ఫారూక్ తాను వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా తనకు పట్టాదారు పాసు పుస్తకం రావడం లేదని రైతు కనుకయ్య కలవలేదు. సదరు వీఆర్ఓ కూడా తనకు ఏనాడూ ఈ విషయంపై చెప్పలేదు. సర్వే చేసినోళ్ల మీద పోసేందుకే..: కనుకయ్య రైతుబాట కార్యక్రమంలో ఇంటింటా సర్వే చేసిన రెవెన్యూ అధికారుల మీద పెట్రోల్ పోసేందుకు తెచ్చాను. కానీ కోపం ఆపుకోలేక వీరిపై పోశాను. అగ్గి పుల్ల అంటించలేదు. కాగా, రికార్డుల ప్రకారం ఒక ఎకరానికి మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే వీలుందని ఆర్డీవో తెలిపారు. బాధిత రైతు జీల కనుకయ్య -
పెట్రోల్ దాడి: ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కరీంనగర్: తహశీల్దార్ పాస్‌పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది. వివరాలు.. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ పనిమాత్రం కావడంలేదు. రేపుమాపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో హల్చల్ చేశాడు. పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులోని కంప్యూటర్లపై పెట్రోల్ పోశాడు. దీంతో వెంటనే తేరుకున్న అక్కడున్న సిబ్బంది ఆయన్ని వెంటనే బయటకు తోసేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటరతో తహశీల్దార్ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
చిగురుమామిడి (కరీంనగర్) : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాంపల్లి సమ్మయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా పంటలు పండకపోవడంతో.. అప్పులు ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
స్వశక్తి సంఘాల మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు
చిగురుమామిడి : రాష్ట్రంలో స్వశక్తి మహిళలకు రూ.1600 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీనిధి రాష్ట్ర మేనేజంగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం చిన్నముల్కనూర్‌లో స్వశక్తి సంఘ మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ మైక్రో, టిన్నీల కింద రూ.600 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైక్రో పథకం కింద ప్రతి మహిళకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు, టిన్నీ కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల స్వశక్తి సంఘాలకు 2.25 లక్షల సంఘాలకు స్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతేడాది 99శాతం రికవరీ సాధించగా.. కరీంనగర్ జిల్లా ముందంజలో ఉందన్నారు. ఈ సంవత్సరం 20వేల పాడిపశువుల కొనుగోలుకు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రుణాల మంజూరు, రికవరీ పారదర్శకంగా ఉండేందుకు ఆధార్‌కార్డుల లింకేజీకి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.350 కోట్ల శ్రీనిధి డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. డీజీఎం ఎల్లయ్య, ఏజీఎం రవికుమార్, హుస్నాబాద్ ఏసీ శ్రీనివాస్, ఏపీఎం సంపత్, సీసీలు సంపత్, వెంకటమల్లు, వెంకటేశ్వర్లు, స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
24న ముల్కనూరుకు సీఎం రాక
చిగురుమామిడి : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దత్తత గ్రామమైన మండలంలోని చిన్న ముల్కనూర్‌కు ఈ నెల 24న వస్తారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ తెలిపారు. బొమ్మనపల్లిలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఈ నెల 22న రావాల్సి ఉండగా, గ్రామజ్యోతి కార్యక్రమంలో బిజీగా ఉన్నందున పర్యటన 24న ఖరారైందని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. తాను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరు గ్రామాలను తాను దత్తత తీసుకున్నప్పటికీ మిగిలిన గ్రామాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో రానున్న నాలుగేళ్లలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. -
వ్యక్తి ప్రాణం తీసిన భూ వివాదం
కరీంనగర్: భూ వివాదం కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణం తీసింది. జిల్లాలోని చిగురుమామిడి గ్రామంలో భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో మహదేవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.