
చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పెట్రోల్ దాడి ఘటన కలకలం సృష్టించింది. పట్టా పాసు పుస్తకంలో తన పూర్తి భూమి నమోదు కాలేదని ఆగ్రహించిన ఓ రైతు సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. అగ్గి పుల్ల అంటించేలోపే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని లంబాడిపల్లికి చెందిన జీల కనుకయ్యకు ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 1142, 1145, 1146లో 4.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 0.19 గుంటలు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైంది. మిగతా 4.0 ఎకరాల కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం లేనిదే వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రెండ్రోజుల క్రితం వీఆర్‌ఓ శంకర్‌ను సంప్రదించగా.. 4.19 ఎకరాలకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చాడు.
సింగిల్ విండో అధికారికి చూపించగా.. ఇది చెల్లదని చెప్పడంతో రైతు కనుకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం తహసీల్దార్‌ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించగా.. గేటు వద్ద వీఆర్‌ఏ అడ్డుకున్నాడు. దీంతో బయటకు వెళ్లిన ఆయన రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి సీని యర్ అసిస్టెంట్ రాంచందర్‌రావు, వీఆర్‌ఏలు నర్స య్య, అనిత, అటెండర్ దివ్యలపై పోశాడు. అగ్గి పెట్టె తీసేలోపే సిబ్బంది కనుకయ్యను బయటకు లాక్కెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, రూరల్ ఏసీపీ పార్థసారథి, ఎల్‌ఎండీ సీఐ మహేశ్‌గౌడ్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఏనాడూ కలవలేదు : తహసీల్దార్ ఫారూక్
తాను వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా తనకు పట్టాదారు పాసు పుస్తకం రావడం లేదని రైతు కనుకయ్య కలవలేదు. సదరు వీఆర్‌ఓ కూడా తనకు ఏనాడూ ఈ విషయంపై చెప్పలేదు.
సర్వే చేసినోళ్ల మీద పోసేందుకే..: కనుకయ్య
రైతుబాట కార్యక్రమంలో ఇంటింటా సర్వే చేసిన రెవెన్యూ అధికారుల మీద పెట్రోల్ పోసేందుకు తెచ్చాను. కానీ కోపం ఆపుకోలేక వీరిపై పోశాను. అగ్గి పుల్ల అంటించలేదు. కాగా, రికార్డుల ప్రకారం ఒక ఎకరానికి మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే వీలుందని ఆర్డీవో తెలిపారు. బాధిత రైతు
జీల కనుకయ్య
Comments
Please login to add a commentAdd a comment