TSREDCO
-
ఇంటి అవసరాలకు.. ఆపై గ్రిడ్‌కు..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల గృహాలకు సౌరవిద్యుత్ యూనిట్లు మంజూరు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో తమ గృహావసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. తద్వారా వీరు విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం పొందేలా చూడొచ్చని, అలాగే, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించవచ్చని భావిస్తోంది. ఈ సౌర విద్యుత్ ఫలకలను బిగించుకునేందుకు డాబా ఇళ్లు ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తోంది. ఈ విద్యుత్ యూనిట్ల ఏర్పాటు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆయా మహిళలకు స్త్రీ నిధి ద్వారా రుణాలను ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు కిలోవాట్ల యూనిట్లను మంజూరు చేయనుంది. దీనికి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి (టీఎస్రెడ్కో) నుంచి సబ్సిడీ వస్తుంది. మండలానికి 35 యూనిట్లు మొదట ఒక్కో మండలానికి 35 సోలార్ విద్యుత్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తున్నారు. స్వయం సహాయక కార్యకలాపాలు సరిగ్గా నిర్వహించే వారిని, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సభ్యులను వీటికి ఎంపిక చేస్తున్నారు. నెలకు 200–300 యూనిట్ల విద్యుత్ వాడుకునే వారు ఈ సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్ యూనిట్లకు నెట్ మీటర్లు బిగించి పవర్ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. సొంత అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌కు నిర్ణీత ధర చొప్పున గ్రిడ్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. విద్యుత్‌ను విక్రయించగా వచ్చే ఆదాయంతో సభ్యులు ఐదేళ్లలో రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 ఏళ్ల వరకు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయని, ఐదేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని అంటున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ విద్యుత్ యూనిట్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించాం. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన రుణాన్ని స్త్రీనిధి ద్వారా అందించనున్నాం. సభ్యులు ఈ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్ చార్జీలను తగ్గించుకోవచ్చు. అలాగే, వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా నెలవారీ ఈఎంఐలు సులువుగా కట్టవచ్చు. –సీహెచ్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
TS: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ కేంద్రాలు
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్ ఎనర్జీ డెవల‹³మెంట్ కార్పొరేషన్) చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ మెషీన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలతో వాహనాలను చార్జింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసుమును నిర్ణయించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొదటిదన్నారు. చార్జింగ్ కేంద్రాల్లో పార్కింగ్ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. -
‘విద్యుత్’లో కేసీఆర్ పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన, పట్టు దేశంలో మరెవరికీ లేదని, విద్యుత్‌లో ఆయన పీహెచ్డీ చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారం తొలుత సీఎం కేసీఆర్‌కే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్రెడ్కో) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇంధన పొదుపు పురస్కారాల–2022’ ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో విద్యుత్ వృథా అధికంగా ఉందని, అవసరం లేకున్నా లైట్లు వేసుకుంటున్నారని అన్నారు. దీనిపై గ్రామస్తుల్లో చైతన్యం తేవాలని కోరారు. ఇంధన పొదుపును పాఠ్యాంశంగా బోధించాలని మంత్రి సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘు మారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. అవార్డు విజేతలు ఇలా.. ఇండస్ట్రీస్ విభాగంలో.. ఐటీసీ లిమిటెడ్‌కు స్పెషల్ అవార్డు, మై హోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గోల్డ్ అవార్డు, గ్రాన్యులెస్ ఇండియా లిమిటెడ్‌కు సిల్వర్ అవార్డు ఎడ్యుకేషనల్ బిల్డింగ్ విభాగంలో.. వర్థమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు గోల్డ్ అవార్డు, విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సిల్వర్ ప్రభుత్వ బిల్డింగ్ విభాగాల్లో.. సంచాల భవన్‌కు గోల్డ్, లేఖా భవన్‌కు సిల్వర్ కమర్షియల్ బిల్డింగ్ విభాగంలో.. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు స్పెషల్ అవార్డు, విప్రో లిమిటెడ్‌కు గోల్డ్, రైల్వేస్టేషన్ బిల్డింగ్ విభాగంలో... కాచిగూడకు గోల్డ్, సికింద్రాబాద్‌కు సిల్వర్ ట్రాన్స్‌పోర్ట్‌లో.. జనగాం డిపోకు గోల్డ్, ఫలక్నామా డిపోకు సిల్వర్.. నల్లగొండ మున్సిపాలిటీకి గోల్డ్, జీహెచ్ఎంసీకి సిల్వర్ అవార్డు. -
డీజిల్ వాహనాలు.. ఇకపై ఎలక్ట్రిక్! ఆటోలకు రూ.15 వేల సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్ వాహనలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాలుష్యనియంత్రణ దిశగా రెడ్కో ఈ చర్యలు చేపడుతోంది. 5 వేల ఆటోలకు బ్యాటరీలు బిగించి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో 500 ఆటోలకు బ్యాటరీలు అమర్చాలని భావిస్తోంది. ఒక్కో ఆటోకు రూ.15 వేల సబ్సిడీని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలో టెండర్లు పిలవాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలకు నెలవారీ అద్దె కింద ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాలే తీసుకునేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా 138 చార్జింగ్ కేంద్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో 138 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్ రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో 118, వరంగల్, కరీంనగర్ నగరాల్లో చెరో 10 చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్ విధానంతోపాటు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పర్యాటక, పౌర సరఫరాల, రోడ్డు, రవాణా శాఖలు తమ పరిధిలో చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనువైన 979 స్థలాలను గుర్తించి టీఎస్ రెడ్కోకు జాబితాను అందజేశాయి. జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖల స్థలాలను ఇప్పటికే అధీనంతోకి తీసుకోగా, మిగిలిన శాఖలతో రెవెన్యూ షేరింగ్ విధానంలో ఒప్పందం చేసుకోవడానికి రెడ్కో చర్యలు తీసుకుంటోంది. చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు 20 మంది ఆపరేటర్లను ఎంప్యానల్ చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి రుణాలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారులను ప్రోత్సహించేందుకు 18 బ్రాండ్లతో రెడ్కో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీదారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంలు, సింగరేణితో కలిసి త్వరలో ఓ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తయారీదారులకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు సహకరించనుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ప్రాచుర్యం కల్పించేందుకు త్వరలో మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనున్నామని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. దీని ద్వారా రుణాలతోపాటు చార్జింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేసే వీలుంటుందని తెలిపారు.