తెల్లాపూర్: రాతి స్తంభాల నడుమ శిలా శాసనం
సాక్షి, సంగారెడ్డి: ప్రతీ ఊరుకూ.. ప్రతీ పేరుకూ ఓ చరిత్ర ఉంటుంది. దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలనే తపనా ఉంటుంది. తెలంగాణ పేరు, పుట్టుక వెనుక ఉన్న చరిత్రపై అనేక అధ్యయనాలు జరిగాయి..జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణ అన్న పేరు వెనుక ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. దాదాపు ఆరువందల ఏళ్ల క్రితం నాటి ఓ శిలాశాసనంలో తెలంగాణపురం ప్రస్తావన బయల్పడింది. శాసనాల సేకరణలో భాగంగా రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తిరుగుతూ ఆర్కియాలజీ అధికారులు వివరాలు సేకరించేవారు.
అందులో భాగంగానే 1986లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో పురావస్తు శాఖకు చెందిన ముఖ్య అధికారి ముకుందరావు ఓ శిలాశాసనాన్ని గుర్తించారు. ఇందులో తెలంగాణపురం ప్రస్తావన ఉంది. అయితే దాని గురించి లోతైన అధ్యయనం జరగలేదు. కేవలం ఆ శాసనంలో ఉన్న వివరాలను ఆర్కియాలజీ విభాగంలో నోట్ చేశారు. 1999 తర్వాత చరిత్ర పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి, జితేంద్రబాబు, బ్రహ్మచారి తదితరులు ఈ శిలాశాసన చరిత్రను ప్రాచుర్యంలోకి తెచ్చారు.
పున:ప్రతిష్ఠ
శిలా శాసనంలో తెలంగాణ పురం ప్రస్తావన వెలుగుచూసిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2008 సంవత్సరంలో ఈమని శివనాగిరెడ్డి, జితేంద్రబాబులతో కలిసి తెల్లాపూర్‌ను సందర్శించారు. అప్పటికే దిగుడుబావి పూర్తిగా పూడుకుపోయింది. కొన్ని మెట్లు మాత్రమే కనిపించాయి. రాతి స్తంభాలు కూడా పడిపోయే దశకు చేరాయి. దిగుడుబావి చుట్టూ అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఒక విధంగా ఆ పరిసరాలన్నీ నిరాదరణకు గురయ్యాయి. దీనికి చలించిపోయిన కవిత తన సొంత డబ్బు ఖర్చు చేసి పొడవాటి స్తంభాల మధ్యలో శిలాశాసనం ఉండేలా పునరుద్ధరణ పనులు చేయించింది. మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలుకు చెందిన శంకర్‌రెడ్డి శిల్పుల బృందం ఈ మరమ్మతు పనులు చేశారు.
వనం చెరువు ఇదే..
లోతైన పరిశోధనలు జరగాలి
స్వరాష్ట్రంలోనైనా తెలంగాణ చరిత్రపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. శాసనం వెలుగుచూసిన 15 సంవత్సరాల వరకూ పునరుద్ధరణ చర్యలేవీ చేపట్టలేదు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తెల్లాపూర్ పరిసరాల్లో చారిత్రక ఆధారాల సేకరణకు ప్రయత్నాలు జరగాలి. దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా
గ్రామపంచాయతీగా ఉన్న తెల్లాపూర్‌లో 2018 లో కొల్లూరు, ఉస్మాన్‌నగర్, ఈదులనాగుపల్లి, వెలిమల గ్రామపంచాయతీలను కలుపుకొని మున్సిపాలిటీగా అవతరించింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డులు ఉన్నాయి. ఐటీ హబ్ దగ్గరలో ఉన్న తెల్లాపూర్ దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లతో నగరీకరణను సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలో తెల్లాపూర్ ఉంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పేరు మార్చాలి
తెలంగాణ రాష్ట్రంలోనైనా తెలంగాణ పదం తొలిసారి వెలుగుచూసిన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. తెల్లాపూర్ పేరును తెలంగాణ పురంగా మార్చేందుకు మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ కాపీని ప్రభుత్వానికి పంపాలని చరిత్రకారులు కోరుతున్నారు. 2012లో మల్లేపల్లి సోమిరెడ్డి తెల్లాపూర్‌తెల్లాపూర్ సర్పంచ్‌గా కొనసాగిన కాలంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంతో తెల్లాపూర్ గ్రామపంచాయతీ పేరును తెలంగాణపురంగా మార్చాలని తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపారు.
అప్పటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణపురం పేరు మార్పుపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గ్రామపంచాయతీ కాస్త మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. అప్పుడు తెల్లాపూర్ సర్పంచ్‌గా సోమిరెడ్డి ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఆయన సతీమణి లలిత ఉన్నారు. ఈమె హయాంలోనైనా పేరు మార్పుకు మున్సిపల్ తీర్మానం చేస్తారా చూడాలి.
పురం అంటే....
పురం అంటే...పట్టణం కంటే పెద్దది. శాసనంలో ప్రస్తావించినట్టు తెలంగాణపురం నాటి కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండవచ్చు. హైదరాబాద్ మహానగరం కంటే ముందే ఈ ప్రాంతం విరాజిల్లినట్టు భావిస్తున్నారు. దిగుడు బావి, ఏతం పదాలు నాటి వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఏర్పాటు చేసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.
శాసనంలో ఏముందంటే...
శక సంవత్సరం 1340లో శ్రీ హేవళాంబి నామ సంవత్సరం, మాఘమాసం, గురువారం రోజున ప్రతిష్టించిన శిలాశాసనం.. మన కాలమాన లెక్కల ప్రకారం చూస్తే 1417–18గా చెప్పవచ్చు. విశ్వకర్మలలో ముఖ్యుడైన రుద్రోజు సిరిగిరోజు దీనిని రాయించినట్టు ఆ శాసనంలో ఉంది. ఆ రోజుల్లో పాలనా వ్యవహారాల్లో ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ బాధ్యతలు విశ్వకర్మలే చూసేవారు.
దిగుడుబావి..సమీపంలో మామిడితోపు, ఏతం అమరికకు ఏర్పాటు చేసి రాతి స్తంభాలు తదితర వివరాలతో పాటు.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా తన సురతాణి(భార్య)తో కలిసి పానగల్లు కోటకు వెలుతున్న క్రమంలో మార్గమధ్యలో తెలంగాణపురం (నేటి తెల్లాపూర్ మున్సిపాలిటీ)లోని మామిడితోటలో విడిది చేశారని, ఆ సమయంలోనే విశ్వకర్మ శిల్పులు ఫిరోజ్‌షా భార్యకు బంగారు ఆభరణాలు బహుమతిగా అందజేసినట్టు ఆ శాసనంలో పొందుపరిచి ఉంది.
దీనిని తెలంగాణపురం ప్రస్తావన ఉన్న తొలి శాసనంగా చరిత్రకారులు ప్రామాణికం చేశారు. ఇంకా తెలంగాణ గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే...కాకతీయ రాజు ప్రతాపరుద్ర గణపతి క్రీస్తుశకం 1510 వేయించిన వెలిచెర్ల శాసనంలోనూ ‘తెలంగాణ’ మాట ఉంది. దీనిని రెండో చారిత్రక ఆధారంగా పేర్కొనవచ్చు.
ఈ ఆధారాలు సరిపోవా ?
తెల్లాపూర్ నాటి తెలంగాణపురం అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణపురం పేరు ఉన్న శాసనం తెల్లాపూర్‌లోనే వెలుగుచూసింది. ఆ శాసనంలో లిఖించబడిన కాలం, రాజు పేరు ఆనాటి బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్‌షా కాలానికి సరిపోతున్నాయి. శాసనంలో పేర్కొన్న విధంగా వనం చెరువు కూడా తెల్లాపూర్‌లోనే ఉంది.
చరిత్రను ముందుతరాలకు అందించాలి
తెలంగాణ శాసనమున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షిత కట్టడంగా ప్రకటించాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేయాలి. మన చరిత్రను ముందుతరాలకు అందించేందుకు ప్రయత్నాలు జరగాలి.
– ఈమని శివనాగిరెడ్డి, చరిత్ర పరిశోధకుడు
Comments
Please login to add a commentAdd a comment