సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సి‘పల్స్’ తేలేందుకు మరికొన్ని గంటలే సమయం.. సుమారు 42 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. పురపాలక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
నిజానికి ఏప్రిల్ 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించి, 5న చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల మీద పడే అవకాశం ఉందనే కారణంతో న్యాయస్థానం ఫలితాలను వాయిదా వేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సోమవారంతో ముగుస్తున్నందున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జోగిపేట-అందోల్, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, జహీరాబాద్‌కు సంబంధించిన ఎన్నికల ఓట్లను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో, సదాశివపేట, మెదక్, సంగారెడ్డి మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్లను పాత డీఆర్‌డీఏ భవనంలో లెక్కిస్తారు.
ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 12.30 గంటలలోపే ఫలితాలు వస్తాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ మీడియాకు తెలిపారు.
ఓట్లను మూడు రౌండ్లలో లెక్కిస్తారు. ఒక రౌండు పూర్తి కావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది. నివేదికలను కూడా ఇవాల్సి ఉంటుంది కాబట్టి గరిష్టంగా 30 నిమిషాల్లో ఒక రౌండు ముగుస్తుంది. ప్రతి రౌండులో 10 వార్డుల ఫలితాలు వస్తాయి. ఈ లెక్కన గంటన్నర వ్యవధిలోనే ఫలితాలు అందుతాయి.
చైర్మన్ ఎంపిక ఆలస్యం...
మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఆలస్యం కానుంది. చైర్మన్ ఎంపికలో ఎమ్మెల్యేల ఓటు కూడా కీలకమే. అయితే ప్రమాణ స్వీకారం తర్వాతే ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషి యో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉం టుంది. కాబట్టి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాతే మున్సిపల్ చైర్మన్లను ఎంపిక చేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పట్టణంలో మద్యం దుకాణాలు బంద్
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌటింగ్ కేంద్రాల సమీపంలోని మద్యం దుకాణాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరుసటి రోజు కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్నందున మంగళవారం కూడా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
మున్సి‘పల్స్’ తేలేది నేడే
Published Sun, May 11 2014 11:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement