చంఢీగఢ్: చంఢీగఢ్‌లో మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్ మనోజ్ సోంకర్ చేతిలో ఓటమి పాలైన ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ ధరోర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్ ఎన్నికలకు సంబంధించిన బాలెట్ పేపర్లు, ఒరిజినల్ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్, హర్యానా కోర్టు రిజిస్ట్రార్‌కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బాలెట్ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది.
చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
చంఢీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్‌లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్-కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment