
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి
సంగారెడ్డి అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య మ రింతగా పెరగాల్సిన అవసరం ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా హె ల్త్‌సొసైటీ సమావేశానికి శరత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, 2011 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27 శాతం ప్రసవాలు జరిగాయని, 2013లో ప్రసవాల సంఖ్య 59 శాతానికి చేరుకుందని తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 75 శాతం ప్రసవాలు అయ్యే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం వైద్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ప్రసవాలకోసం ఆస్పత్రులకు వెళ్లే మహిళలకు 108 ద్వారా రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
వైద్యానికే అధిక ప్రాధాన్యతనివ్వండి
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు , మోడల్ స్కూళ్లతో పాటు అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, ఈ విషయంలో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. మారుమూల గ్రామాల్లో కూడా వైద్యసేవలందించేందుకు ఈ నెల 17న రెండు మొబైల్ మెడికల్ వాహనాలను ప్రారంభించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యసిబ్బంది హాజరును నమోదు చేయడానికి బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గజ్వేల్‌లోని ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రూ.5.3 లక్షల నిధులు విడుదల చేయనున్నట్లు శరత్ తెలిపారు. సమావేశంలో అదనపు జేసీ మూర్తితో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.