కలకలం రేపిన పరువు హత్య | Honour Killing: Man Murdered In Sanga Reddy | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన పరువు హత్య

Published Sat, Sep 26 2020 6:18 AM | Last Updated on Sat, Sep 26 2020 6:59 AM

Honour Killing: Man Murdered In Sanga Reddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ప్రణయ్‌ పరువు హత్యకేసు ఇంకా మరువకముందే.. జిల్లాలో మరో పరువు హత్య సంచలనం కలిగించింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని గురువారం రాత్రి యువతి తరపు కుటుంబీకులు, బంధువులు అతి కిరాతకంగా హత్యచేసి ఈ జిల్లాలో పడేయడం సంచలనం  రేపింది.  

నగరానికి శివారులో ఉండడంతో.. 
హైదరాబాద్‌ నగరానికి జిల్లా శివారులో ఉండడంతో హత్యలు చేయడానికి, హత్యలు నగరంలో చేసి మృతదేహాలు ఇక్కడ పడేయడానికి నిందితులు ఇక్కడ స్థలాన్ని ఎంచుకుంటున్నారు. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని జూన్‌ 10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి తరపు కుటుంబీకులు, బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు, కుటుంబీకులు అదను చూసి గురువారం మధ్యాహ్నం అవంతిని, హేమంత్‌ను కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారు. (ప్రేమే నేరమా..!)

ఈ క్రమంలో మార్గమధ్యలో అవంతి కారులోనుంచి తప్పించుకుంది. హేమంత్‌ను మాత్రం సంగారెడ్డి సమీపంలోని హైదరాబాద్‌–బీదర్‌ జాతీయ రహదారి మార్గంలో కొట్టుకుంటూ తీసుకెళ్లారు.  ఈ విషయాన్ని పోలీసులకు తెలుపడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొండాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిష్టయ్యగూడెం ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. హేమంత్‌ను నగరంలోనే హత్య చేసి ఇక్కడికి తెచ్చి పడేశారా? లేక ఇక్కడే హత్య చేశారా..?  అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

గతంలోనూ..
పరువు హత్యలే కాకుండా పాత కక్షలతో జిల్లాలో హత్య చేయడమో..ఇతర ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాలను పడేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఐదు నెలల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తిని అతని బంధువులే పటాన్‌చెరు సమీపంలోగల రుద్రారం పరిసర ప్రాంతంలో నడిరోడ్డుపై నరికి చంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement