సాక్షి, హైదరాబాద్ : తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్‌ను హత్య చేశారని ఆమె తెలిపారు. అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం)
నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్‌ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ప్రాణాలు తీస్తారనుకోలేదు..
కేవలం కులం అనే కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని మృతుడు హేమంత్ తల్లి లక్ష్మీ భోరున విలపించారు. తన కొడుకుకు ఒక్క చెడు అలవాటు కూడా లేదని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదన్నారు. ‘తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పాను. అయితే వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అర్థరాత్రులు ఫోన్ చేసి బెదరించారు. నా కొడుకును చూస్తే ఎలా చంపాలనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణాలు తీస్తారని ఎప్పుడూ ఊహించలేదని హేమంత్ తండ్రి చింతా మురళి కన్నీటిపర్యంతమయ్యారు.
హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్ట్
హత్య కేసులో 13మందిని అరెస్ట్ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అవంతి,హేమంత్‌ను తీసుకెళ్లారన్నారు. హేమంత్ తండ్రి 100కు కాల్ చేశారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6.30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయానికే హేమంత్‌ను చంపేశారని, ఈ హత్య కేసులో యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులదే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసుల అలసత్వం ఏమీ లేదని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు.
హేమంత్ హత్యకు కొద్ది క్షణాల ముందు తీసిన ఫోటో
Comments
Please login to add a commentAdd a comment