gachibowli police station
-
చేయి తగిలిందని పోలీస్ మార్క్ కేసు!
గచ్చిబౌలి: పబ్‌లో చేయి తగిలిందని ఓ డాక్టర్ మీద కేసు నమోదు చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఫెనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని తబులా రసా పబ్‌కు ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో కలిసి వెళ్లారు. అదే పబ్‌కు కొంత మంది డాక్టర్లు వెళ్లారు. ఐపీఎస్ భార్య వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మదీనాగూడకు చెందిన ఓ డాక్టర్ చేయి తగిలింది. పొరపాటు జరిగిందని సదరు డాక్టర్ ఆమెకు సారీ చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ తర్వాత క్షణాల మీద గచ్చిబౌలి పోలీసులు పబ్‌కు చేరుకున్నారు. సదరు డాక్టర్‌ను గచ్చిబౌ పీఎస్‌కు తరలించారు. నేను కావాలని చేయలేదని, యాదృచి్ఛకంగా జరిగిందని చెప్పినా పోలీసులు శాంతించలేదు. మద్యం ఎక్కువ తాగి అసభ్యంగా ప్రవర్తించాడా అనేది నిర్ధారించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ చేశారు. మద్యం అతిగా తాగలేదని తేలినట్లు సమాచారం. గంటల తరబడి స్టేషన్లోనే కూర్చోబెట్టారు. మరుసటి రోజు పబ్ నిర్వాహకులతో ఫిర్యాదు తీసుకొని ఆ డాక్టర్‌పై కేసు నమోదు చేసి, నోటీసు ఇచ్చి పంపించారు. మహిళలను కించపరిచే వ్యవహరించినా, అసభ్యంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాని ఐపీఎస్ భార్య కావడంతో చిన్న విషయానికి పోలీసులు హంగామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సామాన్యుల ఫిర్యాదుపైనా పోలీసులు ఇలానే వ్యవహరిస్తే బాగుండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం తబులా రసా పబ్ కేసుపై నోరు మెదపడం లేదు. కేసు గురించి మాకు తెలియదని, కేవలం పబ్‌లలో తనిఖీలు మాత్రమే చేశామని గచ్చిబౌలి పోలీసులు బుకాయించడం గమనార్హం. -
Hyderabad: మరణంలోనూ వీడని స్నేహ బంధం
రాయదుర్గం: స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు వి.బాల ప్రసన్న (24) ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. ఇదే జిల్లా మర్రిచెట్టుపాలేనికి చెందిన తన స్నేహితుడు కె.రోహిత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి బాలప్రసన్న మియాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం వేకువజామున బైక్‌పై వెళ్తున్నారు. రోహిత్ వాహనం నడిపిస్తుండగా ప్రసన్న వెనక సీటులో కూర్చున్నాడు. మసీదుబండ నుంచి హఫీజ్‌పేట్ మార్గంమధ్యలో కొత్తగూడ జంక్షన్ ఫ్లైఓవర్ మూల మలుపు వద్ద వీరి బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ గోడను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు, ఇతర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రసన్నను కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి, రోహిత్‌ను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రోహిత్ మృతిచెందాడు. బాల ప్రసన్న 5.18 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 48 నిమిషాల వ్యవధిలో ఇద్దరు స్నేహితులూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. -
స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. పక్కపక్కన ఇళ్లల్లో ఉండే వారిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఇద్దరూ ఉద్యోగ, విద్య రీత్యా వేర్వేరు చోట్ల ఉంటుండగా స్నేహితుల దినోత్సవం రోజైనా కలుసుకుని, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశించారు. అనుకున్నదే తడవుగా ఒక్కచోట కలుసుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత కలుసుకున్నామన్న సంతోషం వారికి కొంతసేపైనా మిగల్చకుండా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స్నేహితుల దినోత్సవం రోజున ప్రాణస్నేహితులు ఇద్దరూ మృతిచెందడం విప్లర్ల గ్రామంలో విషాధచాయలు నింపింది.పల్నాడు: మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కె. రోహిత్(27) యు.బాలప్రసన్న(25) మృతి చెందారు. రోహిత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రోహిత్‌తో గడిపేందుకు అదే గ్రామానికి చిన్ననాటి స్నేహితుడు బాల ప్రసన్న (25) శనివారం విప్పర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురు స్నేహితులు శనివారం రాత్రి హైదరాబాదులో ద్విచక్ర వాహనంపై కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళుతున్న సమయంలో డివైడర్ని ఢీకొని బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి చేరుకొని మృతదేహాలను స్వగ్రామం విప్పర్లకి తరలించారు.⇒ రోహిత్ ఆ కుటుంబానికి పెద్దవాడై ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే తండ్రి లేని రోహిత్ తన తల్లిని పోషించటంతో పాటు తన సోదరుడిని కూడా చదివిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన రోహిత్ తల్లి రోదన గ్రామస్తులను కలచివేస్తుంది.⇒ అలాగే బాలప్రసన్న తన తండి నాగేశ్వరరావుకు మూడవ సంతానం. తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తుండగా, ఇద్దరు కుమారులు వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తన కుటుంబంలో ఒక్కడైనా చదువుకున్న వాడు ఉండాలని, చిన్నవాడైన బాలప్రసన్నను ఇంజినీరింగ్ వరకు చదివించాడు. పై చదువుల కోసం విదేశాలకు పంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ తరుణంలో తన స్నేహితుడితో కలిసి ఫ్రెండ్ షిప్‌డే నిర్వహించుకోవాలని హైదరాబాద్‌కు వెళ్లిన గంటల వ్యవధిలోనే బాలప్రసన్న మృతి చెందాడన్న విషయం తెలియటంతో కుటుంబ సభ్యులంతా శోకసముద్రంలో మునిగి పోయారు. గ్రామస్తుల కళ్లెదురుగా పెరిగిన ఇద్దరు యువకులు చనిపోయారని తెలియటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. -
Gachibowli: అక్కాతమ్ముడి అదృశ్యం.. మా కోసం వెతికితే..
గచ్చిబౌలి: ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కాతమ్ముడు అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మసీదుబండలోని ప్రభుపాదకాలనీలో నివాసముండే అడ్డాల నరేష్ డ్రైవర్. 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన మేనకోడలైన హారిక(20)ను వివాహం చేసుకున్నాడు. ఇంట్లో హారికతో పాటు ఆమె తమ్ముడు ఫణీంద్ర(19) కూడా ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 20వ తేదీన హారిక, ఫణీంద్ర ఇద్దరూ ఇంట్లో చెప్పకుండానే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తమ కోసం వెతికితే చనిపోతామని హారిక లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయింది. ఆమె భర్త నరేష్ కొంతకాలం వారి గురించి పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. హారిక తల్లిని సంప్రదిస్తే తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. కాగా ఐదు నెలల తర్వాత ఆలస్యంగా మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇంట్రాగేషన్ లో లిషి గణేష్ వెన్నకి తగ్గిన క్రిష్.. డ్రగ్స్ కేసులో వాస్తవాలు
-
హైదరాబాద్‌లో బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది. కొండాపూర్ చౌరస్తా సమీపంలో బస్సు కదులుతున్న సమయంలో రోడ్డు పక్క నుంచి వచ్చిన వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ (40) బస్సు వెనుక టైర్ కింద తల పెట్టాడు. అది గమనించిన స్థానికులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. బస్సు టైర్ కింద పడ్డ అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి బిసు రాజాబ్ మృతి చెందాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం.. చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్ గూడలోని పటేల్ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్(15), దీపక్(12), పవన్(14)గా గుర్తించారు. -
అసలే మత్తు.. ఆపై స్పీడు
గచ్చిబౌలి: నటన కలిపిన నలుగురు స్నేహితులు. వీకెండ్ సమయంలో ఓ స్నేహితుడి ఇంట్లో కలిశారు. బాగా మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక టీ తాగుదామని బయటకు వచ్చారు. కారు తీశారు. మద్యం మత్తులో అతివేగంగా నడిపారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఆ వేగానికి కారు రెండు ముక్కలైంది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్నేహితుడి ఇంట్లో కలిసి... మచిలీపట్నానికి చెందిన సాయి సిద్ధూ.. గచ్చిబౌలి జేవీ కాలనీలో నివసిస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా, సీరియల్స్‌లో సైడ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. విజయవాడ గుణదల కాపుల రామాలయం వీధికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (25).. ఐసీఐసీఐ బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ అమీర్‌పేట్ హాస్టల్లో ఉంటున్నాడు. బెంగళూరుకు చెందిన రాజకీయ నాయకుడు సీఎం నారాయణమూర్తి కుమార్తె ఎన్. మానస (22) మూడ్రోజుల క్రితమే సిద్ధూ ఫ్లాట్‌కు వచ్చింది. ఇన్‌స్టాగ్రాంలో సిద్ధూకు పరిచయమైన జడ్చర్లకు చెందిన మరో అమ్మాయి ఎం. మానస (20).. శుక్రవారం ఉదయం జడ్చర్ల నుంచి నేరుగా సిద్ధూ ఫ్లాట్‌కు వచ్చింది. సిద్ధూ స్నేహితుడు రహీం వీళ్లను సాయంత్రం ఫ్లాట్‌లో కలిశాడు. శుక్రవారం రాత్రి సిద్ధూ మినహా మిగతా ముగ్గురు మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక టీ తాగేందుకు వెర్నా జూమ్ కారులో బయటికి వెళ్లారు. వేగంగా వెళ్లి.. చెట్టును ఢీకొని.. మద్యం మత్తులో ఉన్న రహీం అతివేగంగా కారును నడుపుతుండగా వెనకాల ఉన్న ఇద్దరు యువతులు కేరింతలు కొట్టసాగారు. రహీం పక్కనే ఉన్న సిద్ధూ వారించినా రహీం వేగం తగ్గించలేదు. శనివారం తెల్లవారుజామున 2.10 గంటలప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద 140 కిలోమీటర్ల స్పీడులో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు రెండు ముక్కలైంది. దీంతో వెనక కూర్చున్న ఎన్.మానస, ఎం.మానస ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ సీట్లో ఇరుక్కుపోయిన రహీంను పోలీసులు బయటికి తీసేటప్పటికే మృతి చెందాడు. రెండు బెలూన్లు తెరుచుకోవడంతో పక్క సీట్లో ఉన్న సిద్ధూ స్వల్ప గాయాలతో హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీం, ఎం.మానస, ఎన్.మానస మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రహీం రెండ్రోజుల క్రితం జూమ్‌లో ఈ కారును అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనే కలిపింది బీటెక్ ఫెయిల్ అయిన రహీం శిక్షణ తీసుకొని ఉద్యోగం చేస్తానని రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. తండ్రి చనిపోవడంతో తల్లి నజీరాకు అతనే పెద్దదిక్కు. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ జూనియర్ ఆర్టిస్టుగా ప్రయత్నిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ఎన్.మానస ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వారం రోజుల క్రిత మే హైదరాబాద్‌కు వచ్చింది. సినిమాలు, సీరియ ల్స్ అవకాశాల కోసం సిద్ధూ వద్దకు తరచూ వస్తోంది. జడ్చర్లకు చెందిన ఎం. మానస కొన్నేళ్లుగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఎస్బీ ఫిలిం ఫ్యాక్టరీలో నటించినట్టు సమాచారం. వద్దని వారించినా... వీకెండ్ కావడంతో శుక్రవారం సాయంత్రం పార్టీ చేసుకుందామని వాళ్లు ముగ్గురూ బీర్లు తాగారు. నాకు ఉదయమే పని ఉందని చెప్పి తాగలేదు. అతివేగంగా కారు నడపడంతో నేను వారించాను. అయినా రహీం వినలేదు. వెనకాల కూర్చున్న ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో కారు అదుపు తప్పింది. నాకు బ్రీత్ ఎనలరైజర్ పరీక్ష చేయగా జీరో వచ్చింది. – సాయి సిద్ధూ షూటింగ్ ఉందని వెళ్లింది షూటింగ్ ఉందని ఎన్.మానస ఫోన్ చేసి చెప్పడంతో మా చెల్లి ఎం.మానస శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ వెళ్లింది. సాయంత్రం వీడియో కాల్లో ఇద్దరూ మాట్లాడారు. మా చెల్లికి మంచి అవకాశాలు కల్పిస్తానని ఎన్.మానస చెప్పింది. పోలీసులు ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పడంతో షాకయ్యాను. – వైష్ణవి, జడ్చర్ల వారం క్రితమే వచ్చింది బెంగళూరులో ఇంటర్ చదివేటప్పుడు ఎన్.మానస నా క్లాస్మేట్. ఆమె వారం క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. సిటీలో నా రూమ్ తాళం చెవి అడిగితే నేను బెంగళూరు వెళ్లానని చెప్పాను. ఆమె నా ఫ్రెండ్ సిద్ధూతో ఉన్నట్లు నాకు తెలియదు. ప్రమాదం జరిగిందని తెలిసి వచ్చాను. – ప్రీతిక, బెంగళూరు -
హిజ్రాలకు ఐటీ కంపెనీల్లో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం. ఎవరెవరు ఉంటారంటే... గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీఎస్సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్సీఎస్సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఏ సమస్యలంటే... కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు. కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చదవండి: ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా? -
మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని హేమంత్ కుమార్ భార్య అవంతి డిమాండ్ చేశారు. తన మేనమామతో కలిసి మరో ఇద్దరు హేమంత్‌ను హత్య చేశారని ఆమె తెలిపారు. అవంతి శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘మేము 8 ఏళ్లుగా మేమిద్దం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదిరింది. నాతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మా నాన్నకు రాసిచ్చేశాను. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం) నిన్న మధ్యాహ్నం మా మేనమామతో పాటు మరికొంతమంది ఇంట్లోకి చొరబడి మా ఇద్దర్ని కిడ్నాప్ చేశారు. కారులో తీసుకువెళుతుండగా ఇద్దరం అందులో నుంచి కిందకు దూకేశాం. అయితే హేమంత్‌ను కొట్టుకుంటూ బలవంతంగా మళ్లీ కారులో తీసుకుని వెళ్లిపోయారు. నేను కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వెంటనే 100కి కాల్ చేసినా.. 40 నిమిషాల వరకు పోలీసులు స్పందించలేదు. హేమంత్ చనిపోయినట్లు ఇవాళ ఉదయం పోలీసులు మాకు చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రణయ్‌ను హత్య చేసిన మారుతీరావు చివరకు ఏమయ్యారో అందరం చూశాం. హేమంత్‌ను చంపినవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి. నన్ను ప్రేమించినవాళ్లు అయితే హేమంత్‌ను ఎలా చంపుతారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇలాంటి ఘటన జరిగేది కాదు. మమ్మల్ని కిడ్నాప్ చేశాక సాయం చేయాలని అర్థించినా ఎవరూ ముందుకు రాలేదు. మా తల్లిదండ్రులతో మమ్మల్ని కలుపుతారని అనుకున్నా.. నమ్మించి మోసం చేశారు. నా వల్లే ఇదంతా జరిగింది. నేనే లేకుంటే హేమంత్ ఇవాళ బతికి ఉండేవాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); ఇలా ప్రాణాలు తీస్తారనుకోలేదు.. కేవలం కులం అనే కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని మృతుడు హేమంత్ తల్లి లక్ష్మీ భోరున విలపించారు. తన కొడుకుకు ఒక్క చెడు అలవాటు కూడా లేదని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం కూడా తెలియదన్నారు. ‘తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అవంతికి చెప్పాను. అయితే వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అర్థరాత్రులు ఫోన్ చేసి బెదరించారు. నా కొడుకును చూస్తే ఎలా చంపాలనిపించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణాలు తీస్తారని ఎప్పుడూ ఊహించలేదని హేమంత్ తండ్రి చింతా మురళి కన్నీటిపర్యంతమయ్యారు. హేమంత్ హత్య కేసులో 13 మంది అరెస్ట్ హత్య కేసులో 13మందిని అరెస్ట్ చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అవంతి,హేమంత్‌ను తీసుకెళ్లారన్నారు. హేమంత్ తండ్రి 100కు కాల్ చేశారని, పెట్రోలింగ్ వాహనం వెళ్లేసరికి అక్కడ అవంతి లేదన్నారు. తమకు సాయంత్రం 6.30 గంటలకు అవంతి ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. ఆ సమయానికే హేమంత్‌ను చంపేశారని, ఈ హత్య కేసులో యువతి తండ్రి లక్ష్మారెడ్డి, బంధువులదే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసుల అలసత్వం ఏమీ లేదని మాదాపూర్ డీసీపీ స్పష్టం చేశారు. హేమంత్ హత్యకు కొద్ది క్షణాల ముందు తీసిన ఫోటో -
‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
-
‘బిగ్‌బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: పబ్‌లో జరిగిన గొడవపై బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువు రితేశ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని వెల్లడించారు. అసలేం జరిగింది? రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లాడు. రాహుల్ ఇద్దరు స్నేహితురాళ్ల పట్ల రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. అభ్యంతరం తెలిపిన రాహుల్‌ను పక్కకు తోసేశారు. ఎందుకు కామెంట్ చేశారని ప్రశ్నించిన రాహుల్‌పై రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారని సిప్లిగంజ్ చెబుతున్నారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్ ముఖానికి గాయమైంది. (రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి) కాంప్రమైజ్ కాను: రాహుల్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. రితేశ్‌రెడ్డి గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, పబ్‌లోని వీడియో ఫుటేజీని సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
ఇల్లరికం ఇష్టం లేక..
గచ్చిబౌలి: ఇల్లరికం ఇష్టం లేక ఓ వ్యక్తి.. భార్య, కొడుకును గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తమ వంశం అత్తవారికి మిగలవద్దనే ఇద్దరినీ హత్య చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నాటక రాంపూర్ యాద్గిరి జిల్లాకు చెందిన అనంతప్ప (25) అలియాస్ చిన్నాకు తన మేనత్త కూతురు మహాదేవి(22)తో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అనంతప్ప మేనత్తకు నలుగురూ కూతుర్లే కావడంతో అతన్ని ఇల్లరికం తీసుకునేందుకు అప్పట్లో మాట్లాడుకున్నారు. ఏడాది క్రితం మహాదేవి, కూతురు అర్చన(3), కొడుకు ఆకాష్(18 నెలలు)తో కలసి గౌలిదొడ్డికి వచ్చాడు. పెద్ద కూతురు అనురాధ అమ్మమ్మ వద్ద ఉంటోంది. బుధవారం ఉదయం 5.30 సమయంలో నిద్రిస్తున్న భార్య మహాదేవి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఈ సమయంలో భార్య చేయి ఆకాష్ గొంతుపై ఉంది. ఆ చేయిపై మోకాలు పెట్టి అదమడంతో ఆకాష్ గొంతుకు చేయి బిగుసుకుని చనిపోయాడు. ఆడపిల్లలు వంశం మోయలేరన్న భావనతో కూతురు అర్చనను ఏమి అనలేదు. ఉదయం 7.30 గంటల సమయంలో బెంగళూర్‌లో ఉండే స్నేహితుడు శ్రీశైలంకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. విద్యుత్ వైర్లను ఎడమ చేతి వేళ్లకు చుట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ లోపు శ్రీశైలం విషయాన్ని నానక్‌రాంగూడలో ఉండే అనంతప్ప అన్న కొడుకు చెన్నప్పకు తెలిపాడు. 8 గంటల సమయంలో అతను వచ్చి చూడగా అనంతప్ప అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనంతప్ప ఆత్మహత్యాయత్నం చేసిన కొద్ది క్షణాల్లోనే ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బతికాడు. నిందితుడు గచ్చిబౌలిలోని ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహాదేవి, ఆకాష్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తరచుగా గొడవలు: అనంతప్ప మాట్లాడుతూ.. మహాదేవికి వాళ్ల కుల దేవత దేవమ్మ అంటే ఇష్టమని, పూజల విషయంలో ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరిగేవన్నాడు. వనిగిరి రావాలని అత్తింటి వారు ఒత్తిడి చేస్తున్నారని, ఇల్లరికం ఇష్టం లేకే భార్య, కొడుకును హత్యచేశానని చెప్పాడు. వచ్చే వారం అత్తింట్లో కుల దేవత పండగ ఉందని చెప్పడంతో బుధవారం ఉదయం పోదామని భార్యతో చెప్పినట్లు వివరించాడు. మంగళవారం సాయంత్రమే భార్య, కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
అనుశ్రీ ఆచూకీ దొరికింది
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుశ్రీ(22) ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరు పోలీసులు అదుపులో ఉంది. ఆమె సురక్షితంగా ఉందన్న సమాచారంతో తల్లిదండ్రులు, సహోద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. టీసీఎస్‌లో ఆదిభట్ల బ్రాంచ్‌లో పని చేస్తున్న అనుశ్రీ సోమవారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శివారు ప్రాంతాల్లో ఆమె సంచరించినట్టు గుర్తించారు. చివరకు పటాన్ చెరు సమీపంలో ఆమె ఆచూకీ కనిపెట్టారు. ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించనున్నారు. కర్ణాటకకు చెందిన అనుశ్రీ గచ్చిబౌలిలోని దివ్యశ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తండ్రి ప్రభాకర్‌కి ఫోన్ చేసింది. అయితే తాను హైదరాబాద్‌కు వచ్చి హాస్పటల్‌కు తీసుకు వెళతానని కంగారు పడవద్దని కుమార్తెకు నచ్చచెప్పారు. అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రభాకర్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. హాస్టల్లో ఎంక్వైరీ చేయగా, అనుశ్రీ ఆఫీస్‌కు వెళుతున్నట్లు చెప్పిందని తెలిపారు. దీంతో ఆయన టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కూడా అనుశ్రీ రాలేదని తెలిపింది. దీంతో ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టీసీఎస్ మహిళా ఉద్యోగిని అదృశ్యం
హైదరాబాద్ : ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. టీసీఎస్‌లో ఆదిభట్ల బ్రాంచ్‌లో పని చేస్తున్న అనుశ్రీ (22) అదృశ్యం కావడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకకు చెందిన అనుశ్రీ గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఉమెన్స్ పీజీ హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని తండ్రి ప్రభాకర్‌కి ఫోన్ చేసింది. అయితే తాను హైదరాబాద్‌కు వచ్చి హాస్పటల్‌కు తీసుకు వెళతానని కంగారు పడవద్దని కుమార్తెకు నచ్చచెప్పారు. అనంతరం అనుశ్రీకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రభాకర్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. హాస్టల్లో ఎంక్వైరీ చేయగా, అనుశ్రీ ఆఫీస్‌కు వెళుతున్నట్లు చెప్పిందని తెలిపారు. దీంతో ఆయన టీసీఎస్ కార్యాలయానికి వెళ్లగా అక్కడకు కూడా అనుశ్రీ రాలేదని తెలిపింది. దీంతో ప్రభాకర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.