ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం.
ఎవరెవరు ఉంటారంటే...
గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్‌సీఎస్‌సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు...
హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్‌సీఎస్‌సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఏఏ సమస్యలంటే...
- కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు.
- కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment