సాక్షి, హైదరాబాద్: పబ్‌లో జరిగిన గొడవపై బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువు రితేశ్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని వెల్లడించారు.
అసలేం జరిగింది?
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లాడు. రాహుల్ ఇద్దరు స్నేహితురాళ్ల పట్ల రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. అభ్యంతరం తెలిపిన రాహుల్‌ను పక్కకు తోసేశారు. ఎందుకు కామెంట్ చేశారని ప్రశ్నించిన రాహుల్‌పై రితేశ్‌రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారని సిప్లిగంజ్ చెబుతున్నారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్ ముఖానికి గాయమైంది. (రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి)
కాంప్రమైజ్ కాను: రాహుల్
తనపై దాడి చేసిన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. రితేశ్‌రెడ్డి గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, పబ్‌లోని వీడియో ఫుటేజీని సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment