హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి
గత 20 ఏళ్లుగా ఇరువురి మధ్య స్నేహం
విప్పర్ల గ్రామంలో విషాదఛాయలు
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. పక్కపక్కన ఇళ్లల్లో ఉండే వారిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఇద్దరూ ఉద్యోగ, విద్య రీత్యా వేర్వేరు చోట్ల ఉంటుండగా స్నేహితుల దినోత్సవం రోజైనా కలుసుకుని, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టుకుని, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశించారు. అనుకున్నదే తడవుగా ఒక్కచోట కలుసుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత కలుసుకున్నామన్న సంతోషం వారికి కొంతసేపైనా మిగల్చకుండా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. స్నేహితుల దినోత్సవం రోజున ప్రాణస్నేహితులు ఇద్దరూ మృతిచెందడం విప్లర్ల గ్రామంలో విషాధచాయలు నింపింది.
పల్నాడు: మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులైన ఇద్దరు యువకులు శనివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కె. రోహిత్(27) యు.బాలప్రసన్న(25) మృతి చెందారు. రోహిత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రోహిత్‌తో గడిపేందుకు అదే గ్రామానికి చిన్ననాటి స్నేహితుడు బాల ప్రసన్న (25) శనివారం విప్పర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరువురు స్నేహితులు శనివారం రాత్రి హైదరాబాదులో ద్విచక్ర వాహనంపై కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళుతున్న సమయంలో డివైడర్‌ని ఢీకొని బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి చేరుకొని మృతదేహాలను స్వగ్రామం విప్పర్లకి తరలించారు.
⇒ రోహిత్ ఆ కుటుంబానికి పెద్దవాడై ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే తండ్రి లేని రోహిత్ తన తల్లిని పోషించటంతో పాటు తన సోదరుడిని కూడా చదివిస్తున్నాడు. పిల్లల చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన రోహిత్ తల్లి రోదన గ్రామస్తులను కలచివేస్తుంది.
⇒ అలాగే బాలప్రసన్న తన తండి నాగేశ్వరరావుకు మూడవ సంతానం. తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తుండగా, ఇద్దరు కుమారులు వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తన కుటుంబంలో ఒక్కడైనా చదువుకున్న వాడు ఉండాలని, చిన్నవాడైన బాలప్రసన్నను ఇంజినీరింగ్ వరకు చదివించాడు. పై చదువుల కోసం విదేశాలకు పంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ తరుణంలో తన స్నేహితుడితో కలిసి ఫ్రెండ్ షిప్‌డే నిర్వహించుకోవాలని హైదరాబాద్‌కు వెళ్లిన గంటల వ్యవధిలోనే బాలప్రసన్న మృతి చెందాడన్న విషయం తెలియటంతో కుటుంబ సభ్యులంతా శోకసముద్రంలో మునిగి పోయారు. గ్రామస్తుల కళ్లెదురుగా పెరిగిన ఇద్దరు యువకులు చనిపోయారని తెలియటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment