షేక్ అబ్ధుల్ రహీం (ఫైల్) ఎం.మానస (ఫైల్) ఎన్.మానస (ఫైల్)
గచ్చిబౌలి: నటన కలిపిన నలుగురు స్నేహితులు. వీకెండ్ సమయంలో ఓ స్నేహితుడి ఇంట్లో కలిశారు. బాగా మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక టీ తాగుదామని బయటకు వచ్చారు. కారు తీశారు. మద్యం మత్తులో అతివేగంగా నడిపారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఆ వేగానికి కారు రెండు ముక్కలైంది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది.
స్నేహితుడి ఇంట్లో కలిసి...
మచిలీపట్నానికి చెందిన సాయి సిద్ధూ.. గచ్చిబౌలి జేవీ కాలనీలో నివసిస్తున్నాడు. జూనియర్ ఆర్టిస్టుగా, సీరియల్స్‌లో సైడ్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. విజయవాడ గుణదల కాపుల రామాలయం వీధికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (25).. ఐసీఐసీఐ బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ అమీర్‌పేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. బెంగళూరుకు చెందిన రాజకీయ నాయకుడు సీఎం నారాయణమూర్తి కుమార్తె ఎన్. మానస (22) మూడ్రోజుల క్రితమే సిద్ధూ ఫ్లాట్‌కు వచ్చింది.
ఇన్‌స్టాగ్రాంలో సిద్ధూకు పరిచయమైన జడ్చర్లకు చెందిన మరో అమ్మాయి ఎం. మానస (20).. శుక్రవారం ఉదయం జడ్చర్ల నుంచి నేరుగా సిద్ధూ ఫ్లాట్‌కు వచ్చింది. సిద్ధూ స్నేహితుడు రహీం వీళ్లను సాయంత్రం ఫ్లాట్‌లో కలిశాడు. శుక్రవారం రాత్రి సిద్ధూ మినహా మిగతా ముగ్గురు మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక టీ తాగేందుకు వెర్నా జూమ్ కారులో బయటికి వెళ్లారు.
వేగంగా వెళ్లి.. చెట్టును ఢీకొని..
మద్యం మత్తులో ఉన్న రహీం అతివేగంగా కారును నడుపుతుండగా వెనకాల ఉన్న ఇద్దరు యువతులు కేరింతలు కొట్టసాగారు. రహీం పక్కనే ఉన్న సిద్ధూ వారించినా రహీం వేగం తగ్గించలేదు. శనివారం తెల్లవారుజామున 2.10 గంటలప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద 140 కిలోమీటర్ల స్పీడులో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు రెండు ముక్కలైంది.
దీంతో వెనక కూర్చున్న ఎన్.మానస, ఎం.మానస ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ సీట్లో ఇరుక్కుపోయిన రహీంను పోలీసులు బయటికి తీసేటప్పటికే మృతి చెందాడు. రెండు బెలూన్లు తెరుచుకోవడంతో పక్క సీట్లో ఉన్న సిద్ధూ స్వల్ప గాయాలతో హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహీం, ఎం.మానస, ఎన్.మానస మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రహీం రెండ్రోజుల క్రితం జూమ్‌లో ఈ కారును అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
నటనే కలిపింది
బీటెక్ ఫెయిల్ అయిన రహీం శిక్షణ తీసుకొని ఉద్యోగం చేస్తానని రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. తండ్రి చనిపోవడంతో తల్లి నజీరాకు అతనే పెద్దదిక్కు. బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ జూనియర్ ఆర్టిస్టుగా ప్రయత్నిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన ఎన్.మానస ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు అప్‌లోడ్ చేస్తుంది.
వారం రోజుల క్రిత మే హైదరాబాద్‌కు వచ్చింది. సినిమాలు, సీరియ ల్స్ అవకాశాల కోసం సిద్ధూ వద్దకు తరచూ వస్తోంది. జడ్చర్లకు చెందిన ఎం. మానస కొన్నేళ్లుగా షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఎస్బీ ఫిలిం ఫ్యాక్టరీలో నటించినట్టు సమాచారం.
వద్దని వారించినా...
వీకెండ్ కావడంతో శుక్రవారం సాయంత్రం పార్టీ చేసుకుందామని వాళ్లు ముగ్గురూ బీర్లు తాగారు. నాకు ఉదయమే పని ఉందని చెప్పి తాగలేదు. అతివేగంగా కారు నడపడంతో నేను వారించాను. అయినా రహీం వినలేదు. వెనకాల కూర్చున్న ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో కారు అదుపు తప్పింది. నాకు బ్రీత్ ఎనలరైజర్ పరీక్ష చేయగా జీరో వచ్చింది.
– సాయి సిద్ధూ
షూటింగ్ ఉందని వెళ్లింది
షూటింగ్ ఉందని ఎన్.మానస ఫోన్ చేసి చెప్పడంతో మా చెల్లి ఎం.మానస శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ వెళ్లింది. సాయంత్రం వీడియో కాల్‌లో ఇద్దరూ మాట్లాడారు. మా చెల్లికి మంచి అవకాశాలు కల్పిస్తానని ఎన్.మానస చెప్పింది. పోలీసులు ఉదయం ఫోన్ చేసి విషయం చెప్పడంతో షాకయ్యాను.
– వైష్ణవి, జడ్చర్ల
వారం క్రితమే వచ్చింది
బెంగళూరులో ఇంటర్ చదివేటప్పుడు ఎన్.మానస నా క్లాస్‌మేట్. ఆమె వారం క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. సిటీలో నా రూమ్ తాళం చెవి అడిగితే నేను బెంగళూరు వెళ్లానని చెప్పాను. ఆమె నా ఫ్రెండ్ సిద్ధూతో ఉన్నట్లు నాకు తెలియదు. ప్రమాదం జరిగిందని తెలిసి వచ్చాను.
– ప్రీతిక, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment