
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న బీజేపీ ఉమ్మడి జిల్లాలో బలమైన నేతల చేరికలపై దృష్టి సారించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ తయారైంది. ఆ కేడర్‌ను నడిపించగలిగే సత్తా ఉన్న నేతల కోసం అన్వేషణ మొదలైంది.
► జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌లో బీజేపీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది.
► ఆయా చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండడంతో ఆనియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు విజయవంతం అయిన దాఖలాలు లేవు.
► జీహెచ్‌ఎంసీలో పట్టు సాధించిన బీజేపీ పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం ఒకరిద్దరు బలమైన నాయకులు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఘాటైన విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టగలిగే సత్తా ఉన్న నేతలు లేరు.
► అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ.. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోనూ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది.
► కొన్నినెలల క్రితం ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈపాదయాత్రలో నాయకత్వ లోపం స్పష్టంగా బహిర్గతమైందనే అభిప్రాయం వ్యక్తమైంది.
క్షేత్రస్థాయిలో ‘శక్తి’ కేంద్రాలు..
► జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న కమలదళం క్షేత్రస్థాయిలో మాత్రం బాగా బలపడింది.
► శక్తి కేంద్రాల నుంచి మొదలుకుని మండలస్థాయి వరకు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
► బూత్‌స్థాయిలో కనీసం ఐదు నుంచి 15 మంది వరకు క్షేత్రస్థాయి కార్యకర్తలతో పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
► ఇందులో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. జాతీయ అధినాయకత్వం సైతం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బూత్, గ్రామస్థాయి కమిటీల నియామకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ
వచ్చింది.
అంతర్గత కుమ్ములాటలు..
► కాస్త బలమైన నాయకత్వం ఉన్న ఒకటీ, రెండు నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు బీజేపీ అగ్ర నాయకత్వానికి తలనొప్పిగా మారాయి.
► పటాన్‌చెరు నియోజకవర్గంలో ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్‌గౌడ్, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు గోదావరి అంజిరెడ్డి మధ్య సఖ్యత లోపించింది.
► ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీ కేడర్‌లో ఉన్న గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. గురువారం జరిగిన ఆందోల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ జెడ్పీ చైర్మన్ బాలయ్య వర్గాలు బాహాబాహీకి దిగాయి.
► ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి గోవింద్ ఎదుటే రెండు వర్గాల నాయకులు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడం గందరగోళానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment