సంగారెడ్డి పట్టణం వ్యూ
జీఓ 186 జారీ చేసిన మున్సిపల్ శాఖ
ఈ సంస్థ పరిధి..ఐదు మున్సిపాలిటీలు, 466 గ్రామాలు
హెచ్‌ఎండీఏ గ్రామాలను మినహాయించి..
మిగిలిన అన్ని గ్రామాలు దీని పరిధిలోకి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు మున్సిపాలిటీలు, 466 గ్రామ పంచాయతీలను ఈ సంస్థ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ది శాఖ నుంచి జీఓ నం.186ను జారీ చేసింది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలతో పాటు, 20 మండలాల పరిధిలో ఉన్న 466 గ్రామ పంచాయతీలను ఈ సుడా పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి చైర్మన్‌గా కలెక్టర్
సుడాకు ప్రస్తుతానికి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, సభ్యులుగా మున్సిపల్‌శాఖ, టౌన్ అండ్ కంట్రి ప్లానింగ్ డైరెక్టర్లు, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వ్యవహరిస్తారు. రానున్న రోజుల్లో ఈ సుడాకు చైర్మన్‌గా రాజకీయ నేతలను ప్రభుత్వం నియమించనుంది. ఈ పాలక వర్గం నియామకం అయ్యే వరకు కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు.
సుడా పరిధి ఇలా..
అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలతో పాటు, 180 గ్రామ పంచాయతీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాలు ఏడు మండలాల పరిధిలో ఉంటాయి. ఈ గ్రామాలు, మున్సిపాలిటీలను మినహాయించి మిగిలిన జిల్లా అంతా కూడా ఈ సుడా పరిధిలోకి వచ్చింది.
ప్రణాళిక బద్దంగా పట్టణీకరణ
పారిశ్రామికంగా వేగంగా ప్రగతి సాధిస్తున్న సంగారెడ్డి జిల్లాలో పట్టణీకరణ ఓ ప్రణాళిక బద్దంగా జరిగేలా సుడాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇకపై ఈ ప్రాంతంలో ఎలాంటి పట్టణాభివృద్ది పనులు చేపట్టాలన్నా ఈ సుడా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అలాగే లేఅవుట్ల అనుమతులు, ఇతర భారీ నిర్మాణాలకు సంబంధించిన సాంకేతిక టెక్నికల్ మంజూరు ఇలా అన్నీ కూడా సుడా నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా సంగారెడ్డి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)ను ఏర్పాటు అంశాన్ని ‘సాక్షి’ముందే చెప్పింది. ఈ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనల దశలోనే ఈనెల 6వ తేదీన సమగ్ర కథనం ప్రచురితమైన విషయం విదితమే. అనుకున్నట్లుగా ప్రభుత్వం ఈ మేరకు జీఓ నం.186ను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment