
సాక్షి, సంగారెడ్డిః ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ధ్వజమెత్తారు. గురువారం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నాగేశ్వర్ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు తెలంగాణ చేస్తానంటూ కుటుంబ పాలనతో బంగారు కుటుంబం చేసుకున్నారంటూ’ ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేస్తే, నేడు ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారన్నారు. కన్నతండ్రిలా వ్యవహరించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ పాలనకు అతి త్వరలో చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఆ భగవంతుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని క్షమించడని, అతి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబుమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.