సంగారెడ్డి జోన్: జిల్లావ్యాప్తంగా యాసంగి పంటల సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2,05,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. గతేడాది కంటే సుమారు 10 నుంచి 15 వేల ఎకరాల సాగు పెరగనుంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు కురువకపోవడం, చివర్లో అధికంగా పడడంతో పంటలకు కొంతమేర నష్టం వాటిల్లింది. దీంతో యాసంగి సాగు, దిగుబడులపై రైతులు ఎంతో ఆశగా ఉన్నారు.
పెరగనున్న పంటల సాగు..
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువడంతో యాసంగి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అన్నింటికంటే వరి, శనగ పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వరితో పాటు జొన్న, మొక్కజొన్న, గోదుమ, చెరుకు, తెల్లకుసుమ, నువ్వులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ తదితర పంటలు గతేడాది కంటే అధికంగా సాగు చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వానాకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, చెక్‌డ్యాంలు, బావులు నీటితో నిండిపోయాయి. భూగర్భజలాలు పెరిగాయి. దీంతో యాసంగిలో అన్నిరకాల పంటలు సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గతేడాది యాసంగిలో జిల్లాలో 1,91,639 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,05,000 ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. అయితే వర్షాలు అధికంగా పడడంతో రానున్న పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఎరువుల అంచనా..
జిల్లాలో పంటల సాగు అంచనాతో పాటు సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికలు సైతం అధికారులు సిద్ధం చేశారు. అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు అవసరం అయ్యే ఎరువుల వివరాలను అంచనా వేశారు. యూరియా 18,413 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,308 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 4,343, కాంప్లెక్స్ 14,300, ఎస్‌ఎస్‌పీ 3,660 మెట్రిక్ టన్నులు అవసరం అని భావిస్తున్నారు. అక్డోబర్‌లో యూరియా 9,542 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,901, ఎంఓపీ 612, కాంప్లెక్స్ 4,407, ఎస్‌ఎస్‌పీ 433 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రణాళికలు సిద్ధం చేశాం
జిల్లాలో యాసంగి సీజన్‌లో భాగంగా పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేశాం. గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరగే అవకాశాలు ఉన్నాయి. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు కూడా అంచనా వేశాం. రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు పొందాలి.
– శివప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment