సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉద్యమాల పురిటిగడ్డ, టీఆర్‌ఎస్ పుట్టినిల్లు అయిన మెతుకుసీమ పల్లెల్లో హోరాహోరి పోరు కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. రాత్రి పొద్దుపోయాక ప్రకటించిన కడపటి ఫలితాల్లో 272 ఎంపీటీసీ స్థానాలను సాధించి కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతలో ఉండగా, .. జెడ్పీటీసీల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేంత స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకీ రాలేదు. కడపటి ఫలితాలు అందే సమయానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చెరో 21 జెడ్పీటీసీ స్థానాలను సాధించగా, టీడీపీ మాత్రం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచినప్పటికీ, మంత్రి సునీతారెడ్డి నియోజకవర్గమైన నర్సాపూర్, మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గం దుబ్బాకలో పార్టీ పూర్తిగా చేతులెత్తేయడంతో హంగ్ ఏర్పడింది. ఇక గజ్వేల్ అసెంబ్లీ బరిలో ఉన్న గులాబీ దళపతి కేసీఆర్‌కు ప్రమాద ఘంటికలు మోగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఉన్న దామోదర రాజనర్సింహ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అత్యంత కీలకమైన గజ్వేల్ జెడ్పీటీసీని, కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న జగదేవ్‌పూర్ జెడ్పీటీసీతో పాటు మరో జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోగా.. టీఆర్‌ఎస్‌కు పూర్తి పట్టున్న కొండపాక జెడ్పీటీసీతో పాటు మరో రెండు జెడ్పీటీసీలను కలిపి మొత్తం 3 స్థానాలలో కాంగ్రెస్ గెలవడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఆరు జెడ్పీటీసీలు ఉండగా టీఆర్‌ఎస్ బోణి కోట్టలేకపోయింది.
ఇక్కడ ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఆ రెండు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ముందునుంచి ఊహిస్తున్నట్టుగానే టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సొంత ఇమేజ్‌తో టీఆర్‌ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కేసీఆర్ ఏప్రిల్ 9న గజ్వేల్ అసెంబ్లీకి నామినేషన్ వేయగా.. 11న ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. దామోదర రాజనర్సింహ నియోజకవర్గం అందోల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష మెజార్టీ సాధించింది. ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో 6 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 7 ఎంపీపీ స్థానాల్లో 5 స్థానాలు కాంగ్రెస్, రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చాయి. జిల్లాలో 46 జెడ్పీటీసీలకు, 685 ఎంపీటీపీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 6న 24 మండలాల్లో, ఏప్రిల్ 11న 22 మండలాల్లో బ్యాలెట్ పద్ధతిలోఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్లను వేరు చేసి, కట్టలుకట్టి, ఓట్లు లెక్కించాల్సి రావడంతో లెక్కింపు ప్రక్రియ బాగా అలస్యమవుతోంది.
విలక్షణ తీర్పు....
పల్లె ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. మూకుమ్మడిగా ఒకే పార్టీ వైపునకు మొగ్గు చూపకుండా ఆచితూచి ఓట్లు వేశారు. నిజానికి గ్రామాలపై టీఆర్‌ఎస్ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. సర్వేలు కూడా ఫలితాలు కారుకు అనుకూలంగా ఉంటాయని తేల్చాయి. తీరా బాక్స్‌లు విప్పి చూస్తే... ఎవరి అంచనాకు అందకుండా ఓటరు తీర్పు నిచ్చారు. ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపగా.. జెడ్పీటీసీకి వచ్చేవరకు పరిస్థితి తారుమారు అయింది. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. సంగారెడ్డిలో, కొండాపూర్ మండలాల్లో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జెడ్పీటీసీలు మాత్రం విచిత్రంగా టీఆర్‌ఎస్ పార్టీకి దక్కాయి. మిలిగిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.
మీసం మెలేసిన నర్సారెడ్డి...
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, టీఆర్‌ఎస్ పార్టీ కంటే ఒక్క సీటు తక్కువగా వచ్చినా.. మీసం తీసుకుని, రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పల్లె పోరులో మీసం తిప్పారు. ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం కూడా రాకపోగా కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు వచ్చాయి. ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతుండగా, టీఆర్‌ఎస్ మూడో స్థానంలో ఉంది.
పల్లె తీర్పువిలక్షణం
Published Wed, May 14 2014 12:41 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement