సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: ‘కార్పొరేట్ ఆస్పత్రిలో మాదిరిగా అన్ని సౌకర్యాలున్నాయి. 55 మంది డాక్టర్లు.. 56 మంది నర్సులు పనిచేస్తున్నారు. కానీ, బెడ్ ఆక్యుపెన్సీ రేషియో మాత్రం 25 శాతమా? జనవరిలో 24 శాతం, ఫిబ్రవరిలో 29 శాతం, జూన్‌లో 49 శాతం.. డాక్టర్లు ఫుల్.. పేషెంట్లు నిల్’అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.20.50 కోట్లతో ఆధునీకరించిన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలసి ప్రారంభించారు.
అనంతరం వైద్యుల పనితీరుపై హరీశ్‌రావు సమీక్షించారు. ఆయా వైద్య విభాగాల అధిపతులతో ముఖాముఖి నిర్వహించి వైద్యుల పనితీరు తక్షణం మెరుగుపరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. ముగ్గురు గైనకాలజిస్టులు నెల మొత్తానికి చేసిన డెలివరీలు కేవలం మూడు. ఎంబీబీఎస్‌లు పనిచేసే పీహెచ్‌సీల్లో రోజుకు నాలుగైదు డెలివరీలు అవుతున్నాయి. నలుగురు వైద్యులు నాలుగేళ్లుగా విధులకు హాజరుకావడం లేదు. అయినా ఎందుకు పేరోల్ (వేతనాల జాబితా)లో ఉంచారు’అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు అధునాతన వైద్యం అందించేందుకు శంషాబాద్‌లో మరో వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
వైద్యులతో ముఖాముఖి సాగిందిలా..
మంత్రి: నమస్కారం డాక్టర్ పద్మజగారూ.. గైనకాలజీ విభాగంలో ఎంతమంది ఉన్నారు.. జూలైలో ఎన్ని డెలివరీలు చేశారు.
డాక్టర్ పద్మజ: ముగ్గురు డాక్టర్లం ఉన్నాం సర్, మూడు ఆపరేషన్లు చేశాం.
మంత్రి: నీ వేతనం ఎంత చెప్పమ్మా.. నాకు నెలకు రూ.రెండు లక్షలు.. మీకు ఎంత?
డాక్టర్ పద్మజ: రూ.1.90 లక్షలు సర్.
మంత్రి: ముగ్గురు గైనకాలజిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలున్నా పనిచేయకపోతే మిమ్మల్ని ఏమనాలి?
డాక్టర్ పద్మజ: గతంలో ఇక్కడ బాగా పనిచేశాం సర్. ప్రస్తుతం ఆస్పత్రిలో బ్లడ్ నిల్వలు లేవు.
మంత్రి: నార్మల్ డెలివరీ చేయడానికి బ్లడ్ ఎందుకమ్మా? అవసరం పడితే పక్కనే ఉన్న పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో భారీగా రక్తం నిల్వలున్నాయి. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నెలకు 700 డెలివరీలు చేస్తున్నారు. అనస్తీషియా డాక్టర్ ఉన్నారు. జనరల్ సర్జన్ ఉన్నారు. గైనకాలజిస్టులున్నారు. కానీ, ఒక్క డెలివరీ చేయకపోతే అందరూ ఎందుకమ్మా?
డాక్టర్ పద్మజ: ఇకపై బాగా పనిచేస్తాం సర్, డెలివరీలు చేయడం ప్రారంభిస్తాం.
మానవత్వం ఉండాలి
మంత్రి: ఆర్థోపెడిక్ విభాగంలో ఎంతమంది ఉన్నారు? జూలైలో ఎన్ని ఆపరేషన్లు చేశారు.
డాక్టర్ నీరజ: ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు సర్.
మంత్రి : అల్ట్రాసౌండ్ ఉంది. డిజిటల్ ఎక్స్‌రే ఉంది. రెండు ఆపరేషన్ థియేటర్‌లు ఉన్నాయి. అన్ని ఆధునిక సౌకర్యాలున్నాయి. కానీ, జూలైలో ఒక్క ఆపరేషనూ చేయలేదు. ఓ ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ రోజుకు ఎన్ని ఆపరేషన్లు అవుతున్నాయో చూద్దాం. రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల కోసం కనీసం పనిచేయరా? మానవత్వం ఉండాలమ్మా..
డాక్టర్ నీరజ : ఇకపై చేస్తాం సర్..
ఇది కూడా చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్‌లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!
Comments
Please login to add a commentAdd a comment