నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడ, కమాన్, నిజాంపేట గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దసరా సెలవుల సందర్భంగా తాళం వేశారు. సోమవారం పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయడానికి రాగా గది తాళం పగులగొట్టి ఉంది. టీవీ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఆరుట్ల అరుణకు తెలిపారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అలాగే, చల్మెడ కమాన్ వద్ద గల ఓ దాబాలో గది తాళాలు పగులగొట్టి రూ.10వేలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం సిబ్బంది పరిశీలించి ఆధారాలు సేకరించారు.
తాళం వేసిన ఇంట్లో
సిద్దిపేటరూరల్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగిన ఘటన మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మాచాపూర్ గ్రామానికి చెందిన కోరె దేవయ్య శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఆదివారం తిరిగి ఇంటికొచ్చాడు. తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించి లోపకి వెళ్లి చూడగా బీరువా తెరిచి బట్టలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉన్న 2 తులాల నెక్లెస్, మరో 3 తులాల బంగారు అభరణాలు, 100 తులాల వరకు వెండి అభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం జరిగిందని తెలుసుకున్నాడు. దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బట్టల షాపులో చోరీ
కౌడిపల్లి(నర్సాపూర్): తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ ఘటన మండల కేంద్రమైన చోటు చేసుకుంది. సోమవారం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం మేరకు.. కౌడిపల్లి గ్రామానికి చెందిన దేవిచంద్ బట్టల షాపు ఉండగా పైఅంతస్తులో కుటుంబ సభ్యులు ఉంటారు. ఆదివారం షాపు బంద్ చేసి గేట్‌కు తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ వెళ్లాడు. రాత్రి చూడగా ఇంట్లో ల్యాప్‌టాప్, మైబెల్ ట్యాబ్ కనిపించలేదు. ఇంటి పక్కన బల్డింగ్ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment