విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పదో తరగతిలో శతశాతమే లక్ష్యంగా విద్యాశాఖ కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులకు ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఇదే కాకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించింది.
జిల్లాలో 281 పాఠశాలలు
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 281 ఉన్నాయి. వీటిలో సుమారు 14 వేల మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి రోజు సాయంత్రం 4:15 గంటల నుంచి 5:15 వరకు (గంట పాటు) ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు బోధించేలా నెల రోజుల పాటు నిర్వహించే తరగతుల ప్రణాళిక తయారుచేశారు. ప్రతి రోజు ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు హోం వర్క్ ఇస్తూనే, నోట్‌లను సరిదిద్దుతున్నారు.
వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. 71 శాతం నుంచి 100 శాతం మార్కులు ఉన్న విద్యార్థులు ఏ గ్రూపులో, 36 నుంచి 70 శాతం మార్కులుంటే బీ, 35 శాతం కంటే తక్కువ మార్కులు ఉన్న విద్యార్థులకు సీ గ్రూపు కేటాయించనున్నారు. వీటిలో ప్రధానంగా బీ, సీ గ్రూపులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హెచ్‌ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బాలికలు, బాలురుకు వేర్వేరుగా ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో ప్రతి విద్యార్థి పనితీరును పర్యవేక్షించడమే కాకుండా, వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు తరుచుగా మాట్లాడి బోధన మెరుగయ్యేలా చొరవచూపనున్నారు. ఇదే కాకుండా పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లను సందర్శించి, విద్యార్థి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకొని పాఠశాలకు వచ్చేలా తగుచర్యలు తీసుకోనున్నారు.
వందశాతం ఫలితాలే లక్ష్యం
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఈనెల 2వ తేదీ నుంచి సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థిని ఉత్తీర్ణత చేయడమే ప్రత్యేక తరగతుల లక్ష్యం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాదించేలా కృషి చేస్తాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment