మెదక్‌జోన్: సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మూడ్రోజుల క్రితం మాయమైన శిశువు ఆచూకీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో లభ్యమైంది. శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ప్రథమ చికిత్స కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. 15 రోజుల క్రితం మాధవి ప్రసూతి కోసం సంగారెడ్డి మాతా శిశు ఆస్పత్రికి వచ్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 7న గుర్తు తెలియని ఓ వ్యక్తి శిశువు ను తీసుకెళ్లడం ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. శిశువును ఎత్తుకెళ్లిన ఆ వ్యక్తి ఓ మహిళకు అందజేసినట్లు సీసీటీవీ ద్వారా తెలిసింది.
విచారణ ప్రారంభించిన సంగారెడ్డి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివనగర్ గ్రామానికి చెందిన సంతోష్–శోభ దంపతులు శిశువును ఎత్తుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటికొచ్చింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శిశువు తల్లిదండ్రులు మాధవి–మల్లేశానికి సమాచారం అందించారు. శిశువును అపహరించిన నిందితులు ప్రస్తుతం సంగారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్నారు. శిశువును ఎండలో తిప్పడం వల్ల డీహైడ్రెషన్‌కు గురైనట్లు మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు.
నిందితులు కామారెడ్డి జిల్లా
వాసులే: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి సమీపంలోని శివనగర్ గ్రామంలో నిందితులను గుర్తించామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బంగారు సంతోష్, శోభ దంపతులను అదుపులోనికి తీసుకొని విచారించగా.. తమ కూతురు కరుణకు రెండవ కాన్పులో ఆడపిల్ల ఆస్పత్రిలో మరణించిందని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. సంగారెడ్డి ఆస్పత్రిలో నిందితురాలు శోభ ఎస్‌ఎన్‌సీయూ వార్డు దగ్గర ఉండి ఆయా తీసుకొచ్చిన బిడ్డకు తానే తల్లినని చెప్పి తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment