infant baby kidnap
-
ఖమ్మం ఆసుపత్రిలో శిశువు అపహరణ.
సాక్షి, ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నవ శిశువు మాయమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవి 15 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. వైద్య సేవల నిమిత్తం అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న మహిళకు ఈ రోజు ఉదయం అయిదున్నర గంటల సమయంలో తల్లికి పాలు లేకపోవడంతో పాలు ఇప్పిస్తానని నమ్మబలికి గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. ఎంతటికీ మహిళ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. అనంతరం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా నిందితురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
తల్లి ఒడికి చేరిన పసికందు
మెదక్‌జోన్: సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మూడ్రోజుల క్రితం మాయమైన శిశువు ఆచూకీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో లభ్యమైంది. శిశువును తల్లి ఒడికి చేర్చిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ప్రథమ చికిత్స కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. 15 రోజుల క్రితం మాధవి ప్రసూతి కోసం సంగారెడ్డి మాతా శిశు ఆస్పత్రికి వచ్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 7న గుర్తు తెలియని ఓ వ్యక్తి శిశువు ను తీసుకెళ్లడం ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. శిశువును ఎత్తుకెళ్లిన ఆ వ్యక్తి ఓ మహిళకు అందజేసినట్లు సీసీటీవీ ద్వారా తెలిసింది. విచారణ ప్రారంభించిన సంగారెడ్డి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివనగర్ గ్రామానికి చెందిన సంతోష్–శోభ దంపతులు శిశువును ఎత్తుకొని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు విచారించగా అసలు విషయం బయటికొచ్చింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శిశువు తల్లిదండ్రులు మాధవి–మల్లేశానికి సమాచారం అందించారు. శిశువును అపహరించిన నిందితులు ప్రస్తుతం సంగారెడ్డి పోలీసుల కస్టడీలో ఉన్నారు. శిశువును ఎండలో తిప్పడం వల్ల డీహైడ్రెషన్‌కు గురైనట్లు మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. నిందితులు కామారెడ్డి జిల్లా వాసులే: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి సమీపంలోని శివనగర్ గ్రామంలో నిందితులను గుర్తించామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. బంగారు సంతోష్, శోభ దంపతులను అదుపులోనికి తీసుకొని విచారించగా.. తమ కూతురు కరుణకు రెండవ కాన్పులో ఆడపిల్ల ఆస్పత్రిలో మరణించిందని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. సంగారెడ్డి ఆస్పత్రిలో నిందితురాలు శోభ ఎస్ఎన్సీయూ వార్డు దగ్గర ఉండి ఆయా తీసుకొచ్చిన బిడ్డకు తానే తల్లినని చెప్పి తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లిందని చెప్పారు. -
ఐదు గంటల్లోనే ఆ మహిళను గుర్తించాం!
హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 2వ తేదీన 12 గంటల సమయంలో శిశువును కిడ్నాప్ చేశారని, ఐదు గంటల్లోనే కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. శిశువు కిడ్నాప్‌నకు సంబంధించి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో ఈ మహిళ రెండు సార్లు ఇలానే చేసిందని తెలిపారు. కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిన వెంటనే ఈస్ట్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారని వివరించారు. ఈ కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ద్వారా తేలికగా చేధించగలిగామని చెప్పారు. కిడ్నాప్ చేసిన మహిళ శిశువును బీదర్ తీసుకువెళ్లడంతో బీదర్ పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని, అలాగే మీడియా సహకారంతో కూడా ఒక రకంగా ఈ కేసును చేధించగలిగామని తెలిపారు. ఐదు గంటల్లో బీదర్‌కి టీం వెళ్లిందని, అక్కడ ఫోటోగ్రఫీ ద్వారా కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని వివరించారు. అక్కడ ద్విచక్రవాహనంలో కిడ్నాపర్ వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. ఈ సంచలన కేసులో పని చేసిన మా పోలీసు టీంలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను కోరామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ చేతనను అభినందిస్తున్నట్లు చెప్పారు. పాప పేరు చేతనగా నామకరణం చేస్తున్నట్లు శిశువు తల్లి చెప్పిందని వెల్లడించారు. కూతుర్ని తన చెంతకు చేర్చిన పోలీసులందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బీదర్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. -
బీదర్‌లో ప్రత్యక్షమైన నవజాత శిశువు!
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన మహిళ, బీదర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిశువును వదిలి పారిపోయింది. విషయం తెలియడంతో సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన పోలీసులతో బీదర్ చేరుకుని పాపను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఆరు రోజుల పసికందు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ, ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ విషయం గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నించారు. రెండు రోజులుగా మహిళా కిడ్నాపర్ కోసం మూడు బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ విషయం తెలిసి భయపడిపోయిన మహిళా కిడ్నాపర్, శిశువును బీదర్‌లోని ఆసుపత్రిలో వదిలి వెళ్లడంతో కథ సుఖాంతం అయింది. మహిళా కిడ్నాపర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా మహిళను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.శిశువు దొరకడంతో తల్లి విజయ సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. పోలీసులు ఆమెకు శిశువును వీడియో చాట్ ద్వారా చూయించడంతో ఆనందం వ్యక్తం చేసింది. -
పసికందు అపహరణ కేసు ఛేదించిన పోలీసులు
విశాఖపట్నం కింగ్ జార్జీ ఆసుపత్రిలో ఇటీవల పసికందును అపహరించిన కేసును నగర పోలీసులు ఛేదించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు, ఇద్దరు మహిళ ఉద్యోగులతోపాటు అపహరించిన పసికందును కొనుగోలు చేసిన రాణి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. పసికందు అపహరణపై కింగ్ జార్జీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసుపత్రిలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే అత్యంత వేగంగా ఆ కేసును ఛేదించిన సిబ్బందికి నగర వన్‌టౌన్ సీఐ మహ్మద్ రూ. 10 వేలు రివార్డు అందజేశారు.