ఉసిరికపల్లి రోడ్డు ప్రమాద మృతుల్లో దంపతులు, ఇద్దరు బిడ్డలు.. ముగ్గురు మనవరాళ్లు..
తల్లడిల్లిన తాళ్లపల్లితండా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/తూప్రాన్: మద్యం మత్తు, అతివేగం.. మూడు తరాలను చిత్తు చేసింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొంది. శుభకార్యం జరిగిన కొద్ది గంటల్లోనే వారంతా అనంతలోకాల్లో కలిసిపోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఏకంగా మూడు తరాలకు చెందిన వారు మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది.
శివ్వంపేట మండలం తాళ్లపల్లితండాకు చెందిన దనవాత్ శివరాం (55) దుర్గమ్మ(50) దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులతో పాటు పెద్దకూతురు శాంతి (35), మూడో కూతురు అనిత (30) మృతిచెందారు. వీరి కూతుళ్లు మమత(14), శ్రావణి (9), ఇందు (7) మృత్యువాతపడ్డారు.
వేడుక కోసం వెళ్లి... కానరానిలోకాలకు..
శివరాం, దుర్గమ్మ దంపతుల రెండో కూతురు ప్రమీల సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లితండాలో నివాసముంటున్నారు. ఎల్లమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరి గమ్యస్థానానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకున్న సమయంలో మృత్యువు కబళించింది. ఇందులో మృత్యువాత పడిన ఇందు ఎనిమిదో తరగతి, శ్రావణి ఐదో తరగతి చదువుతోంది.
అతివేగమే ప్రాణాలు తీసిందా..
కారు అతివేగంగా నడపడంతోనే అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి అక్కడే ఉన్న బ్రిడ్జి మీద నుంచి కాలువలో పడింది. ఈ ఘటన జరిగినప్పుడు కారు వెనుక నుంచి శివరాం కుమారుడు మరో కారులో వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు వాగులో పడిన విషయాన్ని గమనించి వారు అటువైపు వెళ్తున్న వాహనదారుల సహాయంతో కారులో ఉన్న నామ్‌సింగ్‌ను బయటకు లాగారు. మిగతా వారిని కూడా లాగేందుకు ప్రయత్నించగా డోర్లు ఓపెన్ కాలేదు. జేసీబీని తీసుకు వచ్చి కారును బయటకు తీయగా అప్పటికే ఏడుగురు విగత జీవులయ్యారు.
మిన్నంటిన రోదనలు
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. శివ్వంపేట మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్త బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment