పవన్ తో జగ్గారెడ్డి భేటి, త్వరలోనే జనసేనలోకి..
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కలిశారు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే అవకాశం ఉందన్నారు. రాజకీయ లబ్ది కోసం పవన్ కళ్యాణ్ ను కలువలేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని.. రాజకీయ ప్రయోజనాలకు కోసం తాను కలువలేదన్నారు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం చెబుతానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమా లేదా అనే త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సమావేశమవుతానని.. భవిష్యత్ కార్యాచరణపై తాను త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మీడియాకు వెల్లడించారు. తాజా ఎన్నికల్లో సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే జగ్గారెడ్డి పవన్ కళ్యాణ్ కు చేరువ కావడంపై రాజకీయంగా చర్చకు తెరతీసింది. త్వరలోనే జనసేనలో జగ్గారెడ్డి చేరుతారనే వార్తలు మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి.