
రెండూ టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలి: పవన్
గెలుపొందిన పార్టీ అభ్యర్థులతో సమావేశంలో వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పారు. అయితే అదే సమయంలో జనసేన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతోందని, ఈ రెండింటి మధ్య టెక్నికల్‌గా ఎలా సాధ్యమో చూడాలంటూ వ్యాఖ్యానించారు.
బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన జనసేన అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఓటును బాధ్యతగా భావించి జవాబుదారీతనంతో పని చేయాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ సందర్భంగా పవన్ సూచించారు.
ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కీ లభించని గెలుపును రాష్ట్ర ప్రజలు జనసేనకు అందించారన్నారు. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు.
రూపాయి జీతం మాటలు చెప్పను..
కేవలం రూపాయి జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు కాకుండా ఓ ప్రజా ప్రతినిధిగా ఖజానా నుంచి సంపూర్ణ జీతం తీసుకుంటా. దీనివల్ల తాము చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నందున పనులు ఎందుకు చేయవనే అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే సంపూర్ణంగా జీతం తీసుకొని అంతే సంపూర్ణంగా ప్రజల కోసం కష్టపడతా. ప్రజల కోసం ఎంత జీతం తీసుకున్నా దానికి వెయ్యి రెట్లు వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తా.
యువతకు ప్రజాప్రతినిధులు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా జనసేన ప్రయాణం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. వ్యక్తిగత దూషణలు లేకుండా కొత్త ఒరవడిని తెద్దాం. కొత్తగా నిరి్మస్తున్న జనసేన కార్యాలయం తలుపులు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు నిరంతరం తెరిచే ఉంటాయి.