సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.
బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం.
కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్‌లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment